Warangal Gang Rape: వరంగల్‌లో యువతిపై గ్యాంగ్ రేప్.. సీపీకి బాధితురాలి ఫిర్యాదు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
02 October 2024, 7:28 IST
- Warangal Gang Rape: వరంగల్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతిపై ఆమె స్నేహితుడితో పాటు మరో ఇద్దరు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 15న ఈ ఘటన జరగ్గా.. రెండు రోజుల కిందట ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి ఫిర్యాదు చేసింది.
వరంగల్‌లో యువతిపై సామూహిక అత్యాచారం
Warangal Gang Rape: వరంగల్‌లో యువతిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతి వరంగల్ నగర శివారులోని ఓ ప్రైవేటు కాలేజీలో బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీ సమీపంలోనే హాస్టల్ లో తన స్నేహితులతో కలిసి ఉంటూ చదువుకుంటోంది.
సెప్టెంబర్ 15న భూపాలపల్లికి చెందిన యువతి స్నేహితుడు ఒకరు ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లాడు. తనతో మాట్లాడే పని ఉందంటూ బయటకు పిలిచాడు. హాస్టల్ బయట ఉన్న కారులో ఎక్కాల్సిందిగా కోరాడు. కానీ అప్పటికే ఆ కారులో ఇద్దరు యువకులు ఉండటంతో భయపడిన ఆ యువతి కారు ఎక్కేందుకు నిరాకరించింది. దీంతో ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకుని వరంగల్ సిటీలోకి వచ్చారు.
అనంతరం వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సమీపంలోని ఓయో హోటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఓ రూమ్ తీసుకుని, బలవంతంగా ఆమెకు మద్యం తాగించి, ముగ్గురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం ఆమెను హాస్టల్ వద్ద దించేశారు.
రెండు రోజుల కిందట ఫిర్యాదు
అత్యాచారానికి గురైన యువతి కాలేజీలో పరిక్షలు ఉండటం వల్ల ఇన్నిరోజులు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. పరీక్షలు ముగిసిన అనంతరం భూపాలపల్లిలోని తన సొంతింటికి వెళ్లిన యువతి, తల్లితో జరిగిన విషయాన్ని చెప్పుకుని బోరున విలపించింది. దీంతో రెండు రోజుల కిందట తల్లి, యువతి ఇద్దరూ కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు.
మొదట హనుమకొండ పోలీసులకు రిఫర్ చేసినట్లు తెలిసింది. కానీ అది ఇంతేజార్ గంజ్ పీఎస్ లిమిట్స్ లో జరిగినట్లు తెలుసుకుని యువతిని అక్కడికి పంపించారు. దీంతో వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సూచన మేరకు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులను గుర్తించేందుకు ఆ హోటల్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డారు.
అందులో ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా నిందితుల్లో ఒకరు భూపాలపల్లికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ మేరకు అతడితో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో యువకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా బాధిత యువతిని భరోసా కేంద్రానికి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. ఇదే హోటల్ లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా.. దానిపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాలికను గర్భవతి చేసిన వృద్ధుడు
మరో ఘటనలో పన్నెండేళ్ల బాలికను ఓ వృద్ధుడు గర్భవతిని చేసిన ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సాంబయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు.. తన ఇంటి పక్కనే ఉండే ఓ బాలికపై కన్నేశాడు. బాలిక తండ్రి కొంత కాలం కిందట మరణించగా.. తల్లి ఇద్దరు కొడుకులు, 12 ఏళ్ల కూతురును ఇంటి వద్ద వదిలి తన తల్లిగారింటికి వెళ్లింది.
ఆ సమయంలో బాలికపై కన్నేసిన వృద్ధుడు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి, అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె గర్భం దాల్చగా.. ఇంటికి వచ్చిన తల్లికి విషయం చెప్పడంతో ఆమె గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికకు వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చిన విషయం వాస్తవమేనని తేలింది. అనంతరం ఆమెను భరోసా కేంద్రానికి తరలించి, వృద్ధుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)