Ponnam Prabhakar : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే, బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారు- పొన్నం ప్రభాకర్
11 December 2023, 18:51 IST
- Ponnam Prabhakar : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే బీఆర్ఎస్ నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నేతల తీరు మారలేదని మండిపడ్డారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలే గట్టి బుద్ధి చెపుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత సోమవారం తన సొంత నియోజకవర్గం హుస్నాబాద్ కు వెళ్తూ, గజ్వేల్ లో కాంగ్రెస్ నాయకులను కలవటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఇంటివద్ద ఆగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిందని రవాణా శాఖ మంత్రి విమర్శలు గుప్పించారు. అయితే ఇది గమనించిన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పారన్నారు. అయినా తమ తీరు మార్చుకోని బీఆర్ఎస్ పార్టీ నాయకులూ, ఎన్నికల్లో ఓడిన వారం తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అటువంటి ప్రయత్నం చేస్తే, ప్రజలు ఆ పార్టీకి ఇంకా గట్టిగ బుద్ధి చెపుతారన్నారు.
రైతుబంధు డిసెంబర్ చివరి వారంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాక ముందే రైతు బంధు ఎప్పుడు వేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిసెంబర్ చివరి వారంలోనే రైతుబంధు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే, రెండు గ్యారంటీలు నెరవేర్చమని, మిగతావి కూడాఎలెక్షన్ల ప్రచారంలో చెప్పిన విధంగా వంద రోజుల్లోనే నెరవేరుస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రశేఖర్ రావు ఎప్పుడు కూడా ప్రజలను కలవలేదన్నారు. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని. గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటూ, గజ్వేల్ ప్రజలను కూడా ఎప్పుడు కేసీఆర్ వారిని కలవలేదన్నారు.
ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి
సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన తూముకుంట నర్సారెడ్డి, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు మంత్రిని గజ్వేల్ పట్టణంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికీ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరారు. రాజీవ్ రహదారి మీదుగా హుస్నాబాద్ వెళ్తున్న ప్రభాకర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దేవరాయాంజాల్ గ్రామంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సేవలు గుర్తుచేసుకొని అయన సేవలను కొనియాడారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, మెదక్