Minister Harish Rao : గజ్వేల్ లో 10 వేల మందికి గృహలక్ష్మి ఇండ్లు, రెండ్రోజుల్లో ఖాతాల్లో డబ్బులు- మంత్రి హరీశ్ రావు
03 October 2023, 22:23 IST
- Minister Harish Rao : కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ అధిక అభివృద్ధి జరుగుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే... కామారెడ్డి వద్ద గజ్వేల్ లోనే ఉండాలని కేసీఆర్ ను ఒప్పించే పూచీ నాదన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ లో పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు మంజూరు అయ్యాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కాబట్టే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని హరీశ్ రావు అన్నారు.
రూ. 530 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు నూతనంగా నిర్మించిన వంద పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజు 530 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా 36 కోట్లతో వంద పడకల మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించుకున్నామన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా గర్భిణీలకు, చిన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. అదేవిధంగా గజ్వేల్ లో రూ.300 కోట్లతో నిర్మించుకున్న ఔటర్ రింగ్ రోడ్ ను, రూ.150 కోట్లతో గజ్వేల్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. గజ్వేల్ కి రైలు వచ్చింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యం అయిందని సాగునీరు లేని గజ్వేల్ కు తాగునీరు అందించిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దేనని హరీశ్ రావు కొనియాడారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం అని కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందన్నారు. పనిచేసే కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే కేసీఆర్ మన గౌరవాన్ని మనల్నికాపాడుకుంటారు.
కాంగ్రెస్ అంటేనే అధోగతి
కేసీఆర్ అంటే ప్రగతి అని కాంగ్రెస్ అంటే అధోగతిని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటే ఒక నాటకం అన్నారు. నాటకాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోతామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల బతుకు దుర్భరమైనదిగా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 6, 7 వేల మెగావాట్ల కరెంటు ఉంటే, ఇవాళ 17 వేల మెగావాట్ల విద్యుత్తు ఉందని మూడింతలు ఎక్కువగా కరెంటు వాడుతున్నారన్నారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే దమ్మున్న లీడర్ కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా? కేసీఆర్ మూడు పంటలు కావాలో.. ప్రజలు ఆలోచన చేసి, పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. కేసీఆర్ వచ్చాక రైతు ఆత్మగౌరవం,ఆత్మ విశ్వాసం, భూమి విలువ పెరిగిందని, గతంలో రైతు ఆత్మహత్యలు ఉండేవని సీఎం కేసీఆర్ హయాంలో రైతే రాజు అనే నినాదం నిజం చేశారని మంత్రి అన్నారు. గజ్వేల్ లోఎక్కువ మెజారిటీతో కేసీఆర్ ను గెలిపిస్తే, కామారెడ్డి నుంచి వద్దు గజ్వేల్ లోనే ఉండాలని కేసీఆర్ ను ఒప్పించే పూచీ నాదన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందన్నారు.