Traffic Restrictions:గచ్చిబౌలి టూ కొండాపూర్.. 3 నెలల పాటు రోడ్ బంద్
11 May 2023, 21:25 IST
- Traffic Restrictions in Hyderabad: వాహనదారులకు అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
గచ్చిబౌలి టు కొండాపూర్ రోడ్ బంద్
Traffic Restrictions in Hyderabad: గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు వెళ్లే రోడ్డు మార్గాన్ని 3 నెలల పాటు మూసివేయనున్నారు. ఈ మార్గంలో కొత్తగా ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శిల్పాలేఅవుట్ ఫ్లైవోవర్ రెండోదశ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో నేపథ్యంలో గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిపై ఈనెల 13వ తేదీ నుంచి 90 రోజుల పాటు వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆగస్టు 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది.
అయితే వాహనదారులు వెళ్లాల్సిన రూట్లు, డైవర్షన్లపై ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఓఆర్‌ఆర్ వైపు నుంచి హఫీజ్ పేటకు శిల్పా లేఅవుట్ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్, డెలాయిట్, ఏఐజీ ఆసుపత్రి, క్యూమార్ట్, కొత్తగూడ పై వంతెన మీదుగా వెళ్లాలిని సూచించారు. టెలికాంనగర్ నుంచి కొండాపూర్‌కు వచ్చేందుకు గచ్చిబౌలి పై వంతెన కింద యూటర్న్ తీసుకుని శిల్పాలేఅవుట్ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్, డెలాయిట్, ఏఐజీ ఆసుపత్రి, క్యూమార్ట్, కొత్తగూడ మార్గం మీదుగా ప్రయాణం చేయాలి. ఇక నానక్‌రాంగూడ విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ చౌరస్తా వైపునకు వచ్చే వాహనదారులు ట్రిపుల్ ఐటీ కూడలి వద్ద ఎడమ వైపు వెళ్లి.. గచ్చిబౌలి స్టేడియం ముందు యూటర్న్ తీసుకుని డీఎల్‌ఎఫ్, రాడిసన్ హోటల్ మార్గం మీదుగా వెళ్లాలి. టోలిచౌకి నుంచి ఆల్విన్ చౌరస్తాకు వచ్చే వాహనాలను రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు కూడలి నుంచి మైండ్‌స్పేస్, సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్ మీదుగా డైవర్ట్ చేస్తారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. తాజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని… సహకరించాలని కోరారు.