Ration Rice: జగిత్యాల నుంచి మహారాష్ట్రకు.. కరీంనగర్‌లో ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా
22 May 2024, 10:01 IST
- Ration Rice: జగిత్యాల నుంచి మహారాష్ట్రకు అక్రమ బియ్యం రవాణా ఆగడం లేదు. రామగుండంలో 150 క్వింటాళ్లు, ధర్మారం లో 110 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా
Ration Rice: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే దందా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమార్కులు దొడ్డి దారిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రోజుకో చోట బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి.
తాజాగా రామగుండం టాస్క్ పోర్స్ పోలీసులు బారీ మొత్తంలో 260 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు 8 లక్షల రూపాయల విలువచేసే రేషన్ బియ్యంతోపాటు ఐచర్ డిసిఎం వ్యాన్ ను సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
జగిత్యాల నుంచి మహారాష్ట్ర కు బియ్యాన్ని వ్యాన్ లో తరలిస్తున్న డ్రైవర్ మహుముద్ అలీ అరెస్టు చేశారు. బియ్యం తరలించే అసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన షంశీర్ పై కేసు నమోదు చేశారు.
రామగుండం కమీషనరేట్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ గేట్ వద్ద టాస్క్ పోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఐచర్ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయని రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ తెలిపారు.
అనుమానస్పదంగా వెళ్ళున్న వ్యాన్ ను తనికీ చేయగా 150 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టుబడ్డాయని చెప్పారు. వ్యాన్ డ్రైవర్ మహుముద్ అలీ ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన షoశీర్ జగిత్యాల జిల్లాలో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్ర కు తరలిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ ను అరెస్టు చేయగా బియ్యం అక్రమంగా తరలించే షంశీర్ పరారీలో ఉన్నాడు.
అదే విధంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం చుట్టుపక్కల గ్రామాల నుంచి దుదని తుఫాన్ సింగ్, చింతల సంపత్ సేకరించి అక్రమంగా తరలించేందుకు నిల్వ చేసిన 110 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. దుదాని తుఫాన్ సింగ్ అరెస్టు కాగా చింతల సంపత్ పరారీలో ఉన్నాడని సిపి తెలిపారు.
అక్రమ దందాలు చేస్తే పిడి యాక్ట్ అమలు చేస్తాం-సీపీ
రేషన్ బియ్యంతోపాటు ఎలాంటి అక్రమ దందాలకు పాల్పడే వారిపై పిడి యాక్టుతోపాటు కఠిన చర్యలు చేపడుతామని రామగుండం సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపైనా, అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారి పైన నిఘా పెట్టామని తెలిపారు.
అక్రమ దందాలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నకిలీ పత్తి విత్తనాలు, జీరో వ్యాపారాలు, అక్రమ భూదందాలు భూకబ్జాలు, నకిలీ వ్యాపారాలు, జాబ్ ఫ్రాడింగ్ , ఇసుక, బొగ్గు అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ ,గేమింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.
వరుస దాడులు నిర్వహించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా అక్రమార్కుల కదలికలను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు కేటాయించిన బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)