తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bank Fraud: ఉద్యోగుల పేరుతో ఖాతాలు.. బ్యాంకు నుంచి కోట్లలో రుణాలు

Bank Fraud: ఉద్యోగుల పేరుతో ఖాతాలు.. బ్యాంకు నుంచి కోట్లలో రుణాలు

HT Telugu Desk HT Telugu

27 June 2023, 8:26 IST

google News
    • Bank Fraud: ప్రైవేట్ సంస్థలో ఉద్యోగుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి,ఆ తర్వాత వారి పేరిట కోట్ల రుపాయలు రుణాలను తీసుకుని మోసం చేసిన వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. 
బ్యాంకు ఖాతాలతో హెచ్‌డిఎఫ్‌సికి టోకరా, 20కోట్ల మోసం
బ్యాంకు ఖాతాలతో హెచ్‌డిఎఫ్‌సికి టోకరా, 20కోట్ల మోసం (HT_PRINT)

బ్యాంకు ఖాతాలతో హెచ్‌డిఎఫ్‌సికి టోకరా, 20కోట్ల మోసం

Bank Fraud: హైదరాబాద్‌లో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి ద్వారా ఉద్యోగుల పేరు మీద రూ.20కోట్లు రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడిన వ్యవహారం వెలుగు చూసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఖాతాలను తెరవడం ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు. 11 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 61 మంది ఉద్యోగుల పేరిట హెచ్‌డీఎఫ్‌సీలో రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో బ్యాంకు ఉద్యోగుల సహకారంతో జరిగిన మోసాన్ని గుర్తించారు.

బ్యాంకు సిబ్బందితో కలిసి హైదరాబాద్‌లో ఓ ముఠా రూ.20 కోట్లు కొట్టేసింది. ఈ వ్యవహారంలో సైబర్‌క్రైమ్‌ పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సైబర్‌క్రైమ్‌ డీసీపీ రితిరాజ్‌, ఏసీపీ శ్రీధర్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఏపీలోని వైయస్సార్‌ జిల్లా బుక్కపట్నంకు చెందిన మేకల రాకేశ్‌కుమార్‌రెడ్డి , అనంతపురం జిల్లాకు చెందిన దేశాయ్‌ దినేశ్‌రెడ్డి, బోయ ఆదినారాయణ, వడ్డే వెంకటేశ్‌ కర్నూలుకు చెందిన జి.సాయి రవివర్మ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు పాలూరి దీపక్‌కుమార్‌రెడ్డి, హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన ఇ.రాజ్‌కుమార్‌, నిజాంపేట వాసి ఏనుగుల సురేశ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వ్యక్తిగత రుణాల దరఖాస్తులను పరిశీలించే ప్రగతినగర్‌కు చెందిన దగ్గుబాటి సురేశ్‌, బంజారాహిల్స్‌, బీహెచ్‌ఈఎల్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ వ్యక్తిగత రుణాల విభాగం మేనేజర్లు చిట్టిబాబు, హరీశ్‌చంద్రగోపాల శెట్టి కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు.

కడపకు చెందిన దీపక్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిలు ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారు. దీపక్‌రెడ్డి జీఎస్‌ఆర్‌ అడ్వయిజర్స్‌ పేరిట ఓ సంస్థను ప్రారంభించాడు. ప్రైవేటు సంస్థలకు ప్రత్యేక ప్రాజెక్టులకు స్వల్పకాలిక వ్యవధి కోసం మానవ వనరుల అవసరముంటే ఉద్యోగులను సరఫరా చేస్తాడు. ఈ మేరకు వివిధ సంస్థలకు 67 మంది పేర్లను బ్యాంకు ఖాతాల వివరాలతో సహా అందించాడు.

వారు అయా సంస్థల్లో పనిచేశాక కంపెనీలు ఉద్యోగులకు నెల జీతాలు జమ చేశాయి. పే స్లిప్పులనూ కూడా జారీ చేశాయి. తొలి నెల పూర్తయ్యాక దీపక్‌‌ సంస్థ నుంచి ఉద్యోగుల హాజరు, ఇతర వివరాలను సక్రమంగా ఇవ్వడం లేదని అయా సంస్థలు వారందర్నీ తొలగించాయి. బ్యాంకులకు మాత్రం ఈ సమాచారం ఇవ్వలేదు. ఇక్కడే దీపక్‌, రాకేశ్‌రెడ్డి మోసానికి తెరలేపారు.

తమ వద్ద ఉన్న 61 మందికి చెందిన పే స్లిప్పులతో హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంకుకు ఆన్‌లైన్లో రుణాల కోసం దరఖాస్తు చేశారు. ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలకు వచ్చే సందేశాలూ తమకే చేరేలా మార్పులు చేశారు. బ్యాంకులో వ్యక్తిగత రుణాల విభాగం మేనేజర్లు డి.చిట్టిబాబు, హరీశ్‌చంద్రగోపాల శెట్టి సహకారంతో ఏకంగా రూ.20 కోట్లను రుణాలుగా తీసుకున్నారు. వచ్చిన సొమ్మును అంతా కలిసి పంచుకున్నారు. రుణాలు తీసుకున్న వారు నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు దినేశ్‌ మినహా మిగిలిన వారందర్నీ అరెస్టు చేశారు.

తదుపరి వ్యాసం