తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Love Marriage Issue: ప్రేమ పెళ్లిపై పగ.. నర్సంపేటలో నాలుగు ఇళ్ళు దగ్ధం

Love Marriage Issue: ప్రేమ పెళ్లిపై పగ.. నర్సంపేటలో నాలుగు ఇళ్ళు దగ్ధం

HT Telugu Desk HT Telugu

06 July 2023, 7:38 IST

google News
    • Love Marriage Issue: కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో యువకుడితో పాటు, అతని స్నేహితుల ఇళ్లకు యువతి బంధువులు నిప్పంటించిన ఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి సర్పంచ్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ప్రేమ పెళ్లి చేసుకున్న కావ్య, రంజిత్
ప్రేమ పెళ్లి చేసుకున్న కావ్య, రంజిత్

ప్రేమ పెళ్లి చేసుకున్న కావ్య, రంజిత్

Love Marriage Issue: కుమర్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన తండ్రి, తన బంధువులతో కలిసి యువకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతనికి సహకరించిన స్నేహితుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టించాడు. ఇటికాలపల్లి సర్పంచి మండల రవీందర్‌ కుమార్తె కావ్య హనుమకొండలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

కావ్యకు రెండేళ్ల క్రితం స్వగ్రామానికి చెందిన రంజిత్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అదికాస్త ప్రేమగా మారింది. ఇరువురి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు యువకుడిని హెచ్చరించారు. జూన్‌ 30న కావ్య హనుమకొండలోని తాను ఉంటున్న ప్రైవేటు వసతి గృహం నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత చిలుపూర్‌ గుట్ట మీద రంజిత్‌ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న జంట మంగళవారం హసన్‌పర్తి ఠాణాను ఆశ్రయించడంతో పోలీసులు యువతి తండ్రి రవీందర్‌ను పిలిపించి మాట్లాడారు.

చదువు పూర్తయ్యాక నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేస్తానని, ప్రస్తుతానికి తనతో రావాలని తండ్రి ఎంత బతిమాలినా యువతి ససేమిరా అనడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని యువతి తరఫు బంధువులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ద్విచక్ర వాహనాలపై వెళ్లి గ్రామంలో యువకుడు రంజిత్‌ ఇంటితో పాటు అతని ప్రేమ పెళ్లికి సహకరించారని ప్రవీణ్‌, రాకేశ్‌, విజయ్‌ ఇళ్ల మీద దాడిచేశారు.

ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో సామగ్రిని ధ్వంసం చేశారు. డబ్బాల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. రంజిత్‌ ఇంట్లో తన సోదరి వివాహానికి దాచిన రూ.7 లక్షల నగదు, బంగారాన్ని, ప్రవీణ్‌ ఇంట్లోని రూ.లక్ష నగదు, 10 తులాల వెండిని ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బస్‌స్టాండ్‌ కూడలిలో రాకేశ్‌ కుటుంబ సభ్యులు తోపుడు బండిపై పెట్టుకున్న టిఫిన్‌ సెంటర్‌ను సైతం తగులబెట్టారు.

నిందితులు మొదట కావ్యను పెళ్ళి చేసుకున్న రంజిత్‌ ఇంటి తాళం పగలగొట్టి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. రంజిత్‌కుమార్‌ స్నేహితులైన సామల రాకేశ్‌, బొడ్డుపల్లి అజయ్‌ ఇళ్లకు వెళ్లి వీరంగం సృష్టించారు. వారి ఇళ్లలోని వస్తువులకు నిప్పుపెట్టారు. తర్వాత ఇటుకాలపల్లి సమీపంలోని నర్సింగాపురంలో ఉన్న మరో స్నేహితుడైన బూస ప్రవీణ్‌ ఇంటికి వెళ్లి 20 క్వింటాళ్ల పత్తికి నిప్పు పెట్టారు. నిందితులు తమ ఇంట్లోని రూ.1.50 లక్షల నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ప్రవీణ్‌ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో నాలుగు ఇళ్లల్లో కలిపి సుమారు రూ.10 లక్షల విలువైన ఫర్నీచర్‌, సామగ్రితో పాటు 20 క్వింటాళ్ల పత్తి బూడిదైంది.

కావ్యశ్రీ బంధువుల దాడితో ఇటుకాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు ఆధ్వర్యంలో సీఐ పులి రమేశ్‌, ఎస్సైలు రవీందర్‌, సురేశ్‌ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు యువతి తండ్రి రవీందర్‌తో పాటు అతడి అనుచరులైన 10 మందిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు తాను ఇష్టపూర్తిగానే రంజిత్‌ను పెళ్లి చేసుకున్నానని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని తన తల్లిదండ్రులను కోరుతూ కావ్యశ్రీ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని కోరుకుంటూ కావ్యశ్రీ, రంజిత్‌లు వరంగల్ పోలీసుల్ని ఆశ్రయించారు.

తదుపరి వ్యాసం