TS Police Constable Results : ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోలీస్ ఉద్యోగాలు
05 October 2023, 20:49 IST
- Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలోని జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. వీరిని తండా వాసులు అభినందించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోలీస్ ఉద్యోగాలు ...
Sangareddy district: పేదరికానికి చదువు అడ్డుకాదని… కష్టపడితే ఏదైనా సాధించగలం అని నిరూపించారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబంలోని పిల్లలు. బుధవారం కానిస్టేబుల్ తుది ఫలితాలు ప్రకటించగా…ఈ ఫలితాలలో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం విశేషంగా మారింది.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం జామ్లా తండాకు చెందిన నలుగురికి ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబమంతా ఆనందంతో ఉప్పొంగిపోతుంది.జామ్లా తండాకు చెందిన మెగావత్ నెహ్రు నాయక్,మారోని భాయ్ దంపతుల ఇద్దరు కుమారులు,కూతురు,కోడలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో మెగావత్ సంతోష్ -ఏ ఆర్ కానిస్టేబుల్,మెగావత్ రేణుక -సివిల్ కానిస్టేబుల్,మెగావత్ రమేష్ -TSSPC , రమేష్ భార్య అయినా మోలోత్ రోజా -ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. దీనితో ఆ తండా వాసులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ దివ్య భారతి చరణ్ వారిని అభినందించారు.
నారాయణఖేడ్ లో ...
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తోల్య తండాకు చెందిన భార్యాభర్తలిద్దరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో రాథోడ్ రాజు -TSSPC కి ఎంపిక కాగా ఆయన భార్య సక్కుబాయి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. కష్టపడితే సాధించలేనిది ఏమిలేదని నిరూపించారు. తోల్య తండ ప్రజలు వారిని అభినందించారు . అదేవిధంగా నారాయణఖేడ్ మండలం లోని చాఫ్ట (k)గ్రామం నుంచి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు . ఈ గ్రామంలో ఎంపికైన వారు సాయినాథ్,సంజీవ్,వీరుగొండ ,బీరప్ప,అభిషేక్ ఉండగా… బీరప్ప భార్య సంగీతకు కూడా ఉద్యోగం లభించింది.