తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Elections 2023 : కారెక్కనున్న పొన్నాల....! కేసీఆర్ నుంచి హామీ ఉంటుందా..?

TS Elections 2023 : కారెక్కనున్న పొన్నాల....! కేసీఆర్ నుంచి హామీ ఉంటుందా..?

HT Telugu Desk HT Telugu

15 October 2023, 7:43 IST

google News
    • Telangana Elections 2023 : మాజీ మంత్రి పొన్నాల ఇవాళ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. పార్టీలో చేరికపై చర్చించనున్నారు. అన్ని కుదిరితే… రేపు జనగామలో జరగబోయే సభలో పొన్నాల గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ లోకి పొన్నాల...?
బీఆర్ఎస్ లోకి పొన్నాల...?

బీఆర్ఎస్ లోకి పొన్నాల...?

Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పొన్నాల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పొన్నాల ను బిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకులు కేశవరావు, డి శ్రీనివాస్ తరహాలో తమ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించారని, అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన నిందితుడు రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లో పొన్నాల లక్ష్మయ్య లాంటి ఎందరో సీనియర్ నేతలకు రేవంత్ రెడ్డి గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. లక్ష్మయ్య 1960 లోనే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారని, ఇంజనీర్‌గా నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేశారని ఆయన పేర్కొన్నారు. తన లాభదాయకమైన వృత్తిని విడిచిపెట్టి, మాజీ ప్రధాని పీవీ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చారాని అలాంటి అనుభవం ఉన్న సీనియర్ నాయకుల రాజకీయ సేవలు తమ పార్టీ ఉపయోగించుకుంటుందని ఆయన పేర్కొన్నారు.చచ్చే ముందు పార్టీ మారడం ఏంటని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పు పట్టారు.

రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు : పొన్నాల

పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరచి తమ లాంటి ఎందరో సీనియర్ నాయకులు పార్టీ కి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎంపీగా ప్రతినిత్యం వహిస్తున్న మల్కాజగిరి పరిధిలో ఒక్క కార్పొరేటర్ ను కూడా గెలవలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ లో బీసీలకు అన్యాయం జరుగుతుందని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పటి నుండి నేటి వరకు అన్నీ ఏకపక్ష నిర్ణయలే తీసుకుంటున్నారని లక్ష్మయ్య ఆరోపించారు. వెనుకబడిన తరగతుల పై పదేపదే జరుగుతున్న అవమానాలు, వివక్షలను తట్టుకోలేక పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో అన్ని వర్గాలను పట్టించుకోని రేవంత్ రెడ్డి వైఖరి, ఆయన ఏకపక్ష నిర్ణయాలు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయిందని విమర్శించారు.

నేడే కేసీఆర్ తో పొన్నాల భేటీ

శనివారం కేటీఆర్ తో భేటీ అనంతరం నేడు సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు పొన్నాల లక్ష్మయ్య నిర్ణయించుకున్నారు.కేసీఆర్ తో భేటీ అనంతరం పొన్నాల చేరిక పై అధికారికంగా స్పష్టత రానుంది. అయితే ఈనెల 16న జనగామ లో సిఎం కేసీఆర్ బహిరంగ సభలో పార్టీ లో చేరాలని మంత్రి కేటీఆర్ కోరగా కేసీఆర్ తో భేటీ అనంతరం తన అభిప్రాయాలను వెల్లడిస్తానని తెలిపారు. అయితే పొన్నాల కాంగ్రెస్ పార్టీ లో జనగామ టికెట్ ఆశించారు.. కానీ టికెట్ దక్కే అవకాశం లేకపోవటంతో…. ఆయన పార్టీని వీడారు.కాగా ఇప్పటికే జనగాం టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవ్వాలని దాదాపు ఖరారు కావటంతో… అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో…. పొన్నాల చేరికతో ఏమైనా కీలక మార్పులు ఉంటాయా…? పొన్నాలకు ఏమైనా హామీ ఇస్తారా…? అనేది ఆసక్తికరంగా మారింది.

రిపోర్టర్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం