తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Police Lookout Notice: పరారీలో మాజీ ఎమ్మెల్యే తనయుడు… లుకౌట్ నోటీసులు జారీ

TS Police Lookout Notice: పరారీలో మాజీ ఎమ్మెల్యే తనయుడు… లుకౌట్ నోటీసులు జారీ

Sarath chandra.B HT Telugu

28 December 2023, 9:44 IST

    • TS Police Lookout Notice: కారు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు దుబాయ్ పారిపోయినట్లు తేలడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 
ఎమ్మెల్యే తనయుడి కోసం లుకౌట్ నోటీసు జారీ
ఎమ్మెల్యే తనయుడి కోసం లుకౌట్ నోటీసు జారీ (unspalsh)

ఎమ్మెల్యే తనయుడి కోసం లుకౌట్ నోటీసు జారీ

TS Police Lookout Notice: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి అసలు కారణం మాజీ ఎమ్మెల్యే తనయుడిగా గుర్తించారు. అసలు నిందితుడిని వదిలేసి డ్రైవర్‌ను కేసులో ఇరికించే ప్రయత్నానికి సహకరించిన పోలీసులపై వేటు పడింది.

నాలుగు రోజుల క్రితం బేగంపేట ప్రజాభవన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ ‌గా గుర్తించారు. నిందితుడు దుబాయ్‌కి పారిపోయినట్టు పంజాగుట్ట పోలీసులు నిర్ధారించారు.

శనివారం అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్‌ బేగంపేట ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్‌ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం సేవించినట్టు గుర్తించారు.

పోలీసుల అదుపులో ఉన్న సాహిల్‌ను విడిపించేందుకు పైరవీలు జరిగాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని ఆ తర్వాత వదిలేశారు. ఈ క్రమంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు రావడంతో సీపీ విచారణకు ఆదేశించారు. డీసీపీ విచారణలో భాగంగా ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. అందులో ఎమ్మెల్యే తనయుడిని గుర్తించారు.

పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఉద్దేశపూర్వకంగానే నిందితుడిని వదిలేసినట్టు నిర్ధారణ కావడంతో సీపీ నివేదిక ఇచ్చారు. దీంతో సిఐ, ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ స్టేషన్‌ నుంచి వచ్చాక పోలీస్ కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్‌ తొలుత ముంబయికి, అక్కడి నుంచి సోమవారం దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడిపై పోలీసులు బుధవారం లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున స్టేషన్‌ వద్దకు వచ్చిన నలుగురు వ్యక్తులు పోలీసులతో మంతనాలు జరిపినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో అధికారులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే తనయుడిని కేసు నుంచి తప్పించేందుకు రూ.20-25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. నగదు పంపకాల్లో తలెత్తిన విభేదాలతోనే విషయం వెలుగులోకి వచ్చింది. అధికారుల అంతర్గత విచారణలో సీసీటీవీ ఫుటేజీ బయట పడటంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

తదుపరి వ్యాసం