తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Telangana : రాజకీయాల్లోకి మరో వారసుడు.. ఆసక్తికరంగా వేములవాడ రాజకీయాలు!

BJP Telangana : రాజకీయాల్లోకి మరో వారసుడు.. ఆసక్తికరంగా వేములవాడ రాజకీయాలు!

30 August 2023, 16:02 IST

google News
    • TS Assembly Elections 2023: చెన్నమనేని కుటుంబం నుంచి మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ కుమారుడు వికాస్ రావ్… బుధవారం బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వేములవాడ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
బీజేపీలో చేరిన వికాస్ రావు
బీజేపీలో చేరిన వికాస్ రావు

బీజేపీలో చేరిన వికాస్ రావు

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఇక అధికార బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి... ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు గట్టి సవాల్ విసిరింది. రేపోమాపో మిగతా 4 సీట్లను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ ఎన్నికలను అతిపెద్ద సవాల్ గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ కూడా తొలి జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే… ఓ వారసుడి చేరిక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఆయన వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే… సమీకరణాలు మారే అవకాశం ఉంటుందన్న చర్చ మొదలైంది.

బీజేపీలో చేరిన విద్యాసాగర్ కుమారుడు…

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీనియర్‌ నాయకుల వారసులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తనయుడు వికా‌స్ రావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. అయితే ఆయన చేరికతో వేములవాడ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దాదాపు ఇదే సీటు నుంచి వికాస్ రావ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆ హామీతోనే పార్టీలోకి వచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఏడాది కాలంగా వికాస్‌రావు వేములవాడలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ క్యాడర్‌తోనూ టచ్‌లో ఉన్నారు. ఇటీవలే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాకుండా... కుమారుడిని వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచే బరిలో దింపాలని విద్యాసాగర్ రావు గట్టిగా భావిస్తున్నారని తెలుస్తోంది. వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు.. విద్యాసాగర్‌రావుకు సొంత అన్న అయిన చెన్నమనేని రాజేశ్వర్‌రావు కొడుకు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున చెన్నమనేని రమేశ్ కు టికెట్ దక్కలేదు. ఇక్కడో చెల్మెడకు అవకాశం ఇచ్చారు.

చాలా సంవత్సరాలుగా వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో చెన్నమనేని కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ప్రాంతంలో చెన్నమనేని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చెన్నమనేని రాజేశ్వర్‌ రావు సీపీఐ పార్టీ తరఫున రాజకీయ జీవితం ప్రారంభించి.. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు విద్యా సాగర్‌ రావు బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కేంద్రమంత్రి, గవర్నర్ గా పని చేసిన అనుభవం ఉంది. రామేశ్వరరావు కుమారుడు రమేశ్ బాబు కూడా....వేములవాడ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో చెన్నమనేని హవా నడుస్తూ వచ్చింది. తాజాగా రమేశ్ బాబుకు టికెట్ ఇవ్వకపోవటంతో పరిస్థితి మారుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే రమేశ్ బాబుకు... కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో... విద్యాసాగర్ రావు కుమారుడి ఎంట్రీ వేములవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు.

తదుపరి వ్యాసం