తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ex Dsp Nalini : పిటిషన్ ఇచ్చి 7 నెలలు కావొస్తుంది - నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పా…! - మాజీ డీఎస్పీ నళిని ఆవేదన

Ex DSP Nalini : పిటిషన్ ఇచ్చి 7 నెలలు కావొస్తుంది - నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పా…! - మాజీ డీఎస్పీ నళిని ఆవేదన

21 July 2024, 11:19 IST

google News
    • Ex DSP Nalini Post : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తను ఇచ్చిన రెండు దరఖాస్తులపై ఎలాంటి స్పందన లేదని మాజీ డీఎస్సీ నళిని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలోనే పూర్తి అవుతుందని భావించాను కానీ… 7 నెలలు దాటిపోయిందంటూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో మాజీ డీఎస్పీ నళిని (ఫైల్ ఫొటో)
సీఎం రేవంత్ రెడ్డితో మాజీ డీఎస్పీ నళిని (ఫైల్ ఫొటో)

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ డీఎస్పీ నళిని (ఫైల్ ఫొటో)

Ex DSP Nalini Post : నళిని… తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ పేరు చుట్టూ తెగ చర్చ జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తాల్లోకి ఎక్కారు ఈమె. ఆ తర్వాత రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా పోరాడారు. ఉద్యమ వాణిని వినిపించేందుకు పరకాల బైపోల్ బరిలోనూ నిలబడ్డారు. ఉద్యమ సమయంలో ఎంతో పేరు సంపాదించికున్న నళిని… ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమె ప్రస్తావన పెద్దగా లేకుండా పోయింది.

గత పదేళ్లలో కూడా పెద్దగా కనిపించిన దాఖలు లేవు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా… నళిని ప్రస్తావన తీసుకొచ్చారు. తిరిగి డీఎస్సీ ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదనే అంశంపై ఆరా తీశారు. పోలీసు ఉద్యోగం కుదరకపోతే… అదే స్థాయిలో ఉండే మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో నళినితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వటంతో.. మళ్లీ మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగ అంశం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఆమె స్వయంగా వెళ్లి డిసెంబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. అధ్యాత్మిక ప్రచారానికి సాకారం (వేద విద్యా కేంద్రం)అందించటంతో పాటు తన సర్వీస్ అంశానికి సంబంధించి లేఖలను ఇచ్చినట్లు తెలిసింది.

అయితే తాజాగా మాజీ డీఎస్పీ నళిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సీఎం కలిసిన ఒక్క నెలలోనే తన పిటిషన్ పై ఎంక్వైరీ పూర్తి చేస్తారని భావించానని…. కానీ 7 నెలలు పూర్తి కావొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా…? లేక చేత బుట్టలోకి పోయాయా..? అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.

domakonda.nalini ఫేస్ బుక్ పోస్ట్….

“సిఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద మీద యాది చేసిండు .ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి.ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు.ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవోనని డౌట్ వస్తుంది. ఇప్పుడే చీఫ్ cro ను osd sir ని కదిలించా…! చిట్టి రాసిన. మా చిన్నప్పుడు ఆడుక్కొనేటోడు ఇంటి ముందుకు వస్తె ,ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెళ్లవయ్య అని మెల్లగా చెప్పేటోల్లం. కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి.అందుకే నేను ఇన్నేళ్ళు ఎవ్వరినీ కలవాలే.ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థం అయినవి"

“ఒక నెలలోనే నా పిటిషన్ పై ఎంక్వైరీ పూర్తిచేస్తారు అనుకున్నా. 7 నెలలు కావొస్తోంది.అందుకే రిమైండర్ లెటర్,పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ చూట్టూ తిరిగేంత సమయం మరియు ఓపిక నా వద్ద లేవు అని నేను ఆ రోజే రేవంతన్నకు చెప్పినా…!” అని నళిని తన పోస్టులో రాసుకొచ్చారు.

తాజాగా నళిని చేసిన పోస్టులో ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా పోస్ట్ చేసింది. డిసెంబర్ 30, 2023వ తేదీన ముఖ్యమంత్రికి రెండు పిటిషన్లు ఇచ్చానని గుర్తు చేశారు. అయితే నళిని చేసిన తాజా లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది….!

తదుపరి వ్యాసం