Jagityala ACB trap: జగిత్యాల జిల్లాలో ఏసిబి కి చిక్కిన ఫారెస్ట్ అధికారి..కర్ర రవాణాకు లంచం వసూలు
17 December 2024, 5:57 IST
- Jagityala ACB trap: జగిత్యాల జిల్లాలో అవినీతి అటవీశాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. కేవలం 4500 రూపాయలు లంచంగా తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. అవినీతి అటవీశాఖ అధికారిని అరెస్టు చేసిన ఏసిబి అధికారులు లంచం డబ్బులు సీజ్ చేశారు.
జగిత్యాలలో ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ అధికారి
Jagityala ACB trap: జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫీసుద్దీన్ ఏసీబీకి చిక్కాడు. కర్ర ట్రాన్స్ పోర్ట్ చేసే పల్లెపు నరేష్ వద్ద రూ.4500 లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన పల్లేపు నరేష్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద అన్లైన్ ఫర్మిషన్ తో మామిడి చెట్లు తొలగిస్తున్నాడు.
వాటిని తరలించేందుకు రోడు అండ్ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం కథలాపూర్ మండల ఇంచార్జ్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయిన అఫీసుద్దీన్ ను సంప్రదించాడు. పదివేలు ఇస్తేనే ఫర్మిషన్ ఇస్తానని చెప్పడంతో ముందుగా 5000 ఇచ్చాడు. మరో ఐదువేలు కావాలని అడగటంతో నరేష్ ఏసీబీ ని ఆశ్రయించాడు.
పథకం ప్రకారం పట్టుబడ్డ ఫారెస్ట్ ఆఫీసర్...
నరేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ఏసిబికి అడ్డంగా దొరికాడు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్. కర్ర సప్లై చేసే నరేష్ మెట్ పల్లి లో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అఫీసుద్దీన్ కు 4500 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 4500 రూపాయల నగదు సీజ్ చేసి ఆఫీసుద్దీన్ ను అరెస్ట్ చేశారు. మంగళవారం కరీంనగర్ ఏసిబి కోర్టురో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఫారెస్ట్ ఆఫీసర్ అరెస్టుతో సర్వత్రా హర్షం
లంచం తీసుకుంటూ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆఫీసుద్దిన్ అరెస్టు కావడంతో జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రెండు జిల్లాల ప్రజలను అనవసరంగా ఇబ్బందులు గురిచేసి అందిన కాడికి దండుకున్నాడని అలాంటి వ్యక్తి పాపం పండిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అంటే భయపడే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)