Godavari Flood alert: మళ్లీ వరద గోదారి.. భద్రాచలం వద్ద 46.6 అడుగులతో ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
10 September 2024, 14:01 IST
- Godavari Flood alert: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. తాజాగా వరద ప్రవాహ వేగం పుంజుకుంది. ప్రస్తుతం 46.6 అడుగులతో ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటలకు 45 అడుగులకు చేరుకున్న ప్రవాహం మధ్యాహ్నం ఒంటి గంటకు 46.6 అడుగులకు చేరుకుంది.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి వరద ప్రవాహం
Godavari Flood alert: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. తాజాగా వరద ప్రవాహ వేగం పుంజుకుంది. ప్రస్తుతం 46.6 అడుగులతో ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటలకు 45 అడుగులకు చేరుకున్న ప్రవాహం మధ్యాహ్నం ఒంటి గంటకు 46.6 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గడిచిన రెండు రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ గోదావరి దోబూచులాడుతోంది. మూడు రోజులుగా మెల్లగా పెరుగుతున్న గోదావరి ఉధృతి తాజాగా వేగం పుంజుకుంది. దీంతో అటు అధికారులు, ఇటు ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మళ్లీ లోతట్టు ప్రాంతాలు మునకకు గురవుతున్నాయి.
స్థానిక ఎటపాక వాగు పొంగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం ఆర్డీవో, పోలీసు సిబ్బంది, పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. మరో వైపు రెడ్డిపాలెం - సారపాక మధ్యలో ప్రధాన రహదారి పైకి గోదావరి వరద నీరు చేరుతోంది.
దీంతో ఈ దారిలో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా గోదావరి వరద మరింత పెరుగుతుండటంతో చుట్టు పక్కల మండలాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాగా వరద ఉధృతి 50 అడుగుల మేర పెరిగే అవకాశాలు ఉన్నట్లు సీడబ్ల్యుసీ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి పెరుగుతుండటంతో గోదావరి వేగంగా పెరగడంతో 53 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
హెచ్చరికలు ఇలా..
ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 46.6 అడుగులుగా కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక 43.00 అడుగుల వద్ద జారీ చేశారు. వరద 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగుల వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)