Malaysia Air Lines: ఇంజిన్‌లో మంటలు, శంషాబాద్ విమానాశ్రయంలో కౌలాలంపూర్ విమానానికి తప్పిన ముప్పు
20 June 2024, 9:16 IST
- Malaysia Air Lines: శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
మలేషియా విమానంలో చెలరేగిన మంటలు
Malaysia Air Lines: శంషాబాద్ నుంచి టేకాఫ్ అయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఇంజన్లో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
శంషాబాద్ నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలను గుర్తించి వెంటనే ల్యాండింగ్ కి పైలట్ అనుమతి కోరాడు. కొద్దిసేపు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత తీవ్రత గుర్తించిన ఏటీసీ అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించారు.
ఇంజిన్‌లో మంటలు పెరగక ముందే అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించడంతో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. విమానంలో సిబ్బందితో పాటు మొత్తం 138 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.