తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Brs: గులాబీ గూటిలో కేసుల భయం, కరీంనగర్ మేయర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు

Karimnagar BRS: గులాబీ గూటిలో కేసుల భయం, కరీంనగర్ మేయర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు

HT Telugu Desk HT Telugu

18 October 2024, 10:55 IST

google News
    • Karimnagar BRS: కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలపై కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కీలక నేతలైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ భర్త నగర బిఆర్ఎస్ అద్యక్షులు చల్లా హరిశంకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.
కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు నమోదు
కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు నమోదు

కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు నమోదు

Karimnagar BRS: బీఆర్‌ఎస్‌ నేతలపై నమోదవుతున్న కేసులు ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు కార్పోరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు వివాదాస్పద భూముల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. తాజాగా మేయర్, నగర బిఆర్ఎస్ అధ్యక్షులపై కేసుల నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్ లో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారాయి. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తామై వ్యవహరించిన నేతలు ఇప్పుడు కేసులతో కలవర పడుతున్నారు‌. తొలుత కేసులను ఆషామాషీగా భావించిన బీఆర్ఎస్ నేతలు, అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు పోలీసులపై ఒత్తిడి పెంచడంతో గులాబి గూటిలో గుబులు మొదలై హైకోర్టు ఆశ్రయిస్తున్నారు.

తమ అనుచరులు పార్టీ నేతలపై కేసుల పట్ల మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేస్తూ నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతిని కలిసి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నేతల పై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ నాయకుల పై కేసును నమోదు కావడంతో పాటు అటు పోలీస్ జిల్లా బాస్ సీపీకి, జిల్లా కలెక్టర్ కు ఎస్సీ కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. మేయర్ వ్యవహారంలో కార్పొరేటర్ మెండి శ్రీలత, ఆమె భర్త చంద్రశేఖర్ వరుస ఫిర్యాదులతో ఎస్సీ కమిషన్ ద్వారా సిపి, జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది.

మేయర్ అరెస్టుకై ఒత్తిడి…

దళిత వర్గానికి చెందిన కార్పోరేటర్ పట్ల మేయర్ వివక్షత చూపుతూ అవమానించారని రెండు మాసాల క్రితం 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిర్యాదు పట్ల పోలీసులు సరిగా స్పందించకపోవడంతో శ్రీలత హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సీ కమిషన్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేయించారు. దీంతో మేయర్ పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకొని హైకోర్టును ఆశ్రయించారు.

తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైకోర్టు అందుకు నిరాకరించి 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు మాత్రమే జారీ చేయాలని.. అరెస్టు చేయరాదంటూ పోలీసులకు సూచనలు జారీ చేసింది. మేయర్ అరెస్టుకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకతాటిపై నిలిచి ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం వల్లే మేయర్ సునీల్ రావు హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.

నగర అద్యక్షుడు చల్లా పై కేసు..

మేయర్ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో మరో కీలక నేత నగర పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున హరిశంకర్ కులం పేరుతో దూషించారంటూ రాంనగర్ ప్రాంతానికి చెందిన ఒకరు మరుసటి రోజున ఫిర్యాదు చేయడం.. ఎఫ్ ఐ అర్ నమోదు కావడం వెనువెంటనే జరిగింది. ఈ క్రమంలో దసరా పండగ ముగిసే వరకు పోలీసుల నుంచి ఈ కేసు గురించి ఎటువంటి చలనం లేదని తెలుస్తోంది.

అయితే మేయర్ పై కేసుకు సంబంధించి ఎస్సీ కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన క్రమంలో త్వరలోనే చల్లా హరిశంకర్ కేసు గురించి పోలీసులు సత్వర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వ్యవహారంలో మరింత పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఇద్దరి నేతల వ్యవహారంలో పార్టీ కార్పొరేటర్లు, నేతలకు అండగా నిలిచారని సమాచారం.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తీవ్ర ఇబ్బందులు పడిన తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు మంత్రి పొన్నం దృష్టికి తీసుకువస్తున్న క్రమంలోనే ఇద్దరు గులాబీ నేతలపై చర్యలకు పోలీసు యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

నెక్ట్ ఎవరు..?

కరీంనగర్ లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవుల్లో ఉన్న వారిపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరి తర్వాత ఎవరిపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుందన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వేదికల ద్వారా అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలను ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వ పాలసీని ప్రకటించిన వెనువెంటనే పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి.

పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు భూ కబ్జాల వ్యవహారంలో జైలుపాలయ్యారు. బయటకు వచ్చిన కొందరు నేతలు గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయినా కూడా కేసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి భూ కబ్జాల వ్యవహారంపై పట్టుదలతో ఉండటంతో దర్యాప్తును వేగవంతం చేస్తూ నిందితులను జైలుకు పంపడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురి చేసింది. ఇప్పటి వరకు కింది స్థాయి నేతలే టార్గెట్ గా ఉన్నారని భావించగా..ఇప్పుడు ఏకంగా మేయర్, డిప్యూటీ మేయర్ భర్తపైనే కేసులు నమోదు కావడం పార్టీ శ్రేణుల్లో సంచలనంగా మారింది. ఈ ఇద్దరి తర్వాత మరెవరిపై చర్యలు ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.

పార్టీ నేతలకు ఎమ్మెల్యే గంగుల బాసట..

మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు బిఆర్ఎస్ నాయకుల కేసులు నమోదు కావడంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. గత ఏడెనిమిది నెలల నుంచి కేసుల పరంపర కొనసాగుతుండగా కేసుల విషయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సి పి అభిషేక్ మోహంతిని కలిసి కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా కేసులు పెట్టించి వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టాలపై గౌరవం ఉందని... ఎస్సీ ఎస్టీ కమిషన్ ను గౌరవిస్తామని చెప్పిన గంగుల, తమ నేతలపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిష్పాక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. కరీంనగర్లో బిఆర్ఎస్ బలంగా ఉండడంతో బలహీనపరిచేందుకు కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై కేసులు పెట్టించడంలో చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి పనులపై చూపడం లేదని విమర్శించారు.

కేసుల విషయంలో సిపిని కలిసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బిఆర్ఎస్ హాయాంలో సీఎం అస్యూరెన్స్ క్రింద 350 కోట్లతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన, నాణ్యత లోపంతో ఉండడం పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అభివృద్ధిని విస్మరించి కేసులతో పెత్తనం చెలాయించాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గమనించాలని సూచించారు. కేసుల యవ్వారం బిఆర్ఎస్ నేతల ఆందోళన రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం