తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Pollution: కాలుష్య జలాలు తాగి మూగజీవాలు మృత్యువాత, కళేబరాలతో పీసీబీ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

Sangareddy Pollution: కాలుష్య జలాలు తాగి మూగజీవాలు మృత్యువాత, కళేబరాలతో పీసీబీ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

HT Telugu Desk HT Telugu

23 August 2024, 8:16 IST

google News
    • Sangareddy Pollution: సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. పటాన్‌చెరు , జిన్నారం మండలంలోని ఖాజిపల్లి , కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ప్రాంతాలల్లో కాలుష్య పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.పరిశ్రమలలో వెలువడే హానికరమైన వ్యర్ధాలను నిర్వాహకులు సమీపంలోని చెరువులు, కుంటలకు వదలుతున్నారు.  
జల కాలుష్యంపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎదుట  రైతుల ఆందోళన
జల కాలుష్యంపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎదుట రైతుల ఆందోళన

జల కాలుష్యంపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎదుట రైతుల ఆందోళన

Sangareddy Pollution: సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. పటాన్‌చెరు , జిన్నారం మండలంలోని ఖాజిపల్లి , కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ప్రాంతాలల్లో కాలుష్య పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆ పరిశ్రమలలో వెలువడే హానికరమైన వ్యర్ధాలను నిర్వాహకులు సమీపంలోని చెరువులు, కుంటలకు వదలడంతో, ఆ నీరు విషతుల్యంగా మారుతోంది.

ఆ చెరువులోని నీటిని తాగిన బర్రెలు,మేకలు, పక్షులు, చేపలు, కోళ్లు వంటి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పరిశ్రమలపై పీసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

ఒకే రైతుకు చెందిన 14 గేదెలు ....

గత 10 రోజులలో ఖాజిపల్లి, గడ్డపోతారం, కిష్టాయిపల్లికి చెందిన 20 కి పైగా బర్రెలు ఇక్కడి చెరువులు, నీటి వనరులలో నీటిని తాగి మృతి చెందాయి . దీంతో వాటిపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా గడ్డిపోతారం పంచాయితీ కిష్టాయిపల్లి గ్రామానికి చెందిన బశెట్టి సాయి అనే రైతుకు చెందిన 14 గేదెలు మృతి చెందగా, మరో 4 గేదెలు స్థానిక నీటి గుంటలో నీరు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడు తున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుండి వరసగా నాలుగు రోజులు ఈ గ్రామాలలో గేదెలు మృతి చెందుతున్నాయి.

కళేబరాలతో పీసీబీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా …

దీంతో ఆగ్రహం చెందిన రైతు కుటుంబం, స్థానికులు, మిగతా బాధితులు కలిసి స్థానిక కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు పిర్యాదు చేశారు. అయినా వారు స్పందించకపోవడంతో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రైతులు చనిపోయిన గేదెల కళేబరాలను బుధవారం హైదరాబాద్ లోని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కేంద్ర కార్యాలయానికి తీసుకొని వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా కాలుష్య జలాలను బహిరంగ ప్రాంతాలకు వదిలివేయడంతో జలాశయాలు కలుషితం అవుతున్నాయని వాపోయారు. అందుకు బాధ్యులైన పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సాయికి చెందిన గేదెలు మృతిచెందడంతో అతనికి భారీగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. అనంతరం పీసీబీ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

కిష్టాయిపల్లికి చెందిన బశెట్టి సాయి మాట్లాడుతూ ఇప్పటి వరకు 14 గేదెలు చనిపోగా, మరో మూడు ప్రాణాలతో పోరాడుతున్నామని తెలిపారు. పరిశ్రమల వల్ల తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందన్నారు. తమ ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని తాగడం వల్ల గొర్రెలు, మేకలు, కోళ్లు మృత్యువాత పడుతున్నా, ఆ కేసులు నమోదు కావడం లేదన్నారు. కలుషిత నీటి వనరులు వన్యప్రాణులు మరియు చేపల జీవనాన్ని కష్టతరం చేస్తున్నాయని వాపోయారు. పరిశ్రమలు, గాలి, నీరు, భూమి హానికరమైన వ్యర్ధ పదార్ధాలను విడుదల చేయడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారన్నారు.

మహబూబ్ సాగర్ లో 2 లక్షలకు పైగా చేపలు మృతి …

కాలుష్య జలాల వలన సంగారెడ్డి లోని మహబూబ్ సాగర్ చెరువులో బుధవారం ఒక్కసారిగా చేప పిల్లలు మృతి చెంది నీటిపై తేలియాడుతూ కనిపించాయి. సుమారు 2 లక్షలకు పైగా చేపలు మృతి చెందాయని మత్స్యకారులు తెలిపారు. పట్టణంలోని కాలుష్య జలాలు చెరువులోకి వదలడంతో చేపలు చనిపోయినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరిగేషన్, మత్స్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులు చెరువును పరిశీలించి, కారణాలను తెలుసుకున్నారు. నీటి కాలుష్యంతో చేపలు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మత్స్యకార కుటుంబాలు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి తమను ఆదుకోవాలని సమాచారం అందించారు. వెంటనే జగ్గారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వాటిని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అనంతరం మహబూబ్ సాగర్ లో చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్న కుటుంబాలను ఆదుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హెచ్‌టి తెలుగు)

తదుపరి వ్యాసం