Fake Notes: పోలీసులకు చిక్కిన నకిలీ నోట్ల ముఠా... ఐదుగురు అరెస్ట్, రూ.1.61 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం
03 October 2024, 11:02 IST
- Fake Notes: జగిత్యాల జిల్లాలో చిరు వ్యాపారులకు నకిలీ నోట్లను అంటగట్టి మోసం చేసే ముఠా గుట్టు రట్టయింది. ఐదుగురిని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.61 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Fake Notes: నకిలీ రూ.500 నోట్లు జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించాయి. చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని చలామణి చేసే ముఠాకు చెందిన ఐదుగురిని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు ముఠా వివరాలు వెల్లడించారు.
కోరుట్లలో ఉంటున్న రాజస్తాన్ కు చెందిన రాకేశ్ కుమార్, ముఖేష్ కుమార్ అక్కడి నుంచి నకిలీ కరెన్సీ తీసుకువచ్చి కోరుట్లలో చలామణి చేస్తున్నారు. వారికి మేడిపల్లి మండలం బీమారం కు చెందిన శ్రీధర్, కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన సిద్దిఖీ, కోరుట్లకు చెందిన శంకర్ సహకరించారు.
ఇటీవల బాలాజీ రోడ్డులో కొబ్బరి బోండాల వ్యాపారి బంగారి సాయన్న, పండ్ల వ్యాపారిని, మార్కెట్ రోడ్ లో చపాతీలు విక్రయించే మహిళకు నకిలీ రూ.500 నోట్ ఇచ్చి మోసం చేయడంతో నిఘా పెట్టగా ఐదుగురు పట్టుబడ్డారని డిఎస్పీ తెలిపారు.
ఒకే నెంబర్ తో నకిలీ నోట్లు..
పట్టుబడ్డ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.61 లక్షల విలువ గల నకిలీ రూ.500 నోట్లు ఒకే నంబర్ తో చాలా వరకు ఉన్నాయి. వాటిని కలర్ జిరాక్స్ ప్రింట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటితో పాటు వేర్వేరు నంబర్లు ఉన్న కొన్ని నకిలీ నోట్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా నకిలీ నోట్లు చలామణి కాలేదు. రూ.500 నోట్లు ఎవరైనా ఇస్తే జాగ్రత్తగా పరిశీలించి నకిలీదని అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
భారీ చోరీని ఛేదించిన కరీంనగర్ పోలీసులు
కరీంనగర్ టూటౌన్ పరిధిలోని ప్రగతి నగర్ లో వారం రోజుల క్రితం జరిగిన భారీ చోరీని పోలీసులు చేధించారు. మహిళతో సహా ఇద్దరిని అరెస్టు చేసి 187 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 24న పిట్టల లహరి ఇంటికి తాళం వేసి మార్కెట్ కు వెళ్ళగా ఇద్దరు చొరబడి 187 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళారు.
లహరి మార్కెట్ నుంచి వచ్చేసరికి తాళం తీసి ఉండడం.. ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసింది. అనుమానితులైన త్రిపురాని లహరి, ఆమె బంధువు మంచిర్యాలకు చెందిన చిలుకాని రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని టౌన్ ఏసిపి నరేందర్ తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)