Duplicate Products: బ్రాండెడ్ ముసుగులో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్‌ల దందా, గుట్టురట్టు చేసిన వరంగల్ టాస్క్ ఫోర్స్
25 September 2024, 7:21 IST
- Duplicate Products: ప్రస్తుత సమాజంలో అసలు వస్తువులకంటే నకిలీలే ఎక్కువైపోయాయి. ఇన్నాళ్లు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు,సామాన్ల పేరులో అక్షరాలు మార్చి నకిలీవి జనాలకు అంటగట్టే దందా చూశాం. కానీ వరంగల్ నగరంలో మరో కొత్త మోసం బయట పడింది. కరెంట్ వైర్లు, స్విచ్లను కూడా నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు
వరంగల్‌లో పట్టుబడిన నకిలీ ఎలక్ట్రికల్ ఉత్పత్తులు
Duplicate Products: భవన నిర్మాణ రంగంలో ఇంటి అవసరాలకు ఉపయోగించే కరెంట్ వైర్లు, ఎలక్ట్రికల్ స్విచ్‌లను కూడా నకిలీవి తయారు చేసి, బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులుగా జనాలకు అంటగడుతున్నారు. కొంతకాలంగా వరంగల్ నగరంలో జరుగుతున్న ఈ దందాకు వరంగల్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు చెక్ పెట్టారు.
బ్రాండెడ్ కంపెనీల మాటున నకిలీ దందా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, పెద్ద మొత్తంలో నకిలీ ప్రొడక్టులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి ఏరియా శివ నగర్ కు చెందిన చౌదరి ధనరావు కొన్నేళ్ల నుంచి శ్రీపార్వతీ ఎలక్ట్రికల్స్ పేరున బిజినెస్ చేస్తున్నాడు. భవన నిర్మాణ రంగంలో ఉపయోగించే ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్లు, ఇతర వస్తువులను అమ్ముతున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో లాభాలు చూడాలని ధనరావు అక్రమ దందాకు తెరలేపాడు.
బ్రాండెడ్ పేరున నకిలీలు
ధనార్జనే ధ్యేయంగా ధనరావు నకిలీ దందాకు శ్రీకారం చుట్టాడు. మార్కెట్ లో బ్రాండెడ్ కంపెనీలుగా పేరున్న పాలీకాబ్, ఫినోలెక్స్, వీ గార్డ్, యాంకర్ తదితర కంపెనీల పేరుతో నకిలీ వైర్లు, స్విచ్లు అమ్మడం మొదలు పెట్టాడు. కొంతకాలంగా ఇలా అక్రమ దందా సాగిస్తుండగా.. నకిలీ వస్తువులు కొని చాలామందే ఇబ్బందులకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు గుట్టుగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వరంగల్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు ధనరావు నిర్వహిస్తున్న శ్రీపార్వతీ ఎలక్ట్రికల్స్ షాప్ లో తనిఖీలు నిర్వహించారు.
షాప్ లో సోదాలు నిర్వహించి, ఓనర్ ధనరావును అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న నకిలీ వైర్లు, స్విచ్చులను పరిశీలించి, ధనరావును విచారించారు. దీంతో ధనరావు అసలు విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. ఎక్కుల లాభాలు చూడాలనే ఉద్దేశంతోనే బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ వైర్లు, స్విచ్లు అమ్ముతున్న అంగీకరించాడు.
దీంతో ధనరావును అదుపులోకి తీసుకుని షాపులో ఉన్న రూ.28,67,762 విలువైన వివిధ కంపెనీల పేరుతో ఉన్న నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ కోసం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్ సీఐ ఎస్. రాజు, మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య, ఎస్సై భాను ప్రకాశ్ , ఇతర పోలీస్ సిబ్బందిని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ అభినందించారు. జనాలకు నకిలీ వస్తువులు అమ్ముతూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మధుసూదన్ హెచ్చరించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)