తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pfi : నిజమాబాద్‌లో ఉగ్ర శిక్షణ… పోలీసుల దర్యాప్తులో కీలక సమాచారం…

PFI : నిజమాబాద్‌లో ఉగ్ర శిక్షణ… పోలీసుల దర్యాప్తులో కీలక సమాచారం…

HT Telugu Desk HT Telugu

05 August 2022, 9:11 IST

google News
    • పేదరికంలో ఉన్న యువకుల్ని చేరదీయడం, వారికి లేనిపోనివి నూరిపోయడం, దేశానికి, సమాజానికి వ్యతిరేకంగా తయారు చేయడం, హింసాత్మక ఘటనలకు తెగబడటంలో శిక్షణనిస్తున్న విషయాన్ని  తెలంగాణ పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌లో గత నెలలో కలకలం సృష్టించిన కరాటే ట్రైనింగ్ సెంటర్ వ్యవహారంలో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. 
నిజామాబాద్‌లో ఉగ్ర శిక్షణ కలకలం
నిజామాబాద్‌లో ఉగ్ర శిక్షణ కలకలం (HT_PRINT)

నిజామాబాద్‌లో ఉగ్ర శిక్షణ కలకలం

నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న యువతను గుర్తించి వారిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న సంస్థ వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పేరుతో తమ వ్యతిరేక వర్గాలపై దాడులకు శిక్షణనిస్తున్నట్లు గుర్తించారు. రాళ్లు రువ్వడం, గుంపులుగా దాడి చేసి మాయమవ్వడం, రాళ్ల దాడులతో అలజడి సృష్టించడం వంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిజామాబాద్‌లో ఇటీవల ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులకు కరాటే శిక్షణ సామాగ్రితో పాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియాకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు లభించాయి. స్థానికంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే వ్యక్తి ఇంటి దగ్గర అనుమానస్పద కదలికలు ఉండటంతో పోలీసులు దాడి చేశారు. ఇంటిలోపల మార్షల్ ఆర్ట్స్‌ శిక్షణనిస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత జాబితాలో ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పోస్టర్లు లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

స్వచ్ఛంధ సంస్థలు, ధార్మిక సంస్థల ముసుగులో విరాళాలు సేకరిస్తూ ప్రజలకు దగ్గరై విస్తరించే లక్ష్యంతో పాపులర్ ఫ్రంట్ పనిచేస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద యువకుల్ని గుర్తించి వలవేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం ద్వారా యువతను తమవైపు తిప్పుకున్నారు. భైంసా, బోధన్, జగిత్యాల, హైదరాబాద్‌, కర్నూలు, నంధ్యాల, నెల్లూరు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి యువతను సమీకరించే ప్రయత్నాలు చేశారు. ఇతర వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినపుడు వాటిలోకి చొరబడి అల్లర్లు జరిగేలా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు.

నిజామాబాద్‌లో పాపులర్ ఫ్రంట్ నిర్వహిస్తున్న ఉగ్ర శిక్షణా శిబిరంలో కీలకంగా వ్యవహరించిన అబ్దుల్ ఖాదర్, మహ్మద్ ఇమ్రాన్, షేక్ సాదుల్లా, మహ్మద్ అబ్దుల్ మొబిన్‌లను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. పట్టణంలో కరాటే శిక్షకుడిగా వ్యవహరించిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ నిజామాబాద్‌ ఆటోనగర్‌లో తన ఇంట్లోనే కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నిర్మాణానికి పాపులర్ ఫ్రంట్ నిధులు సమకూర్చింది. విరాళాల ద్వారా సేకరించిన సొమ్మును కేసుల్లో ఇరుక్కునే వారికి న్యాయ సాయం అందించడానికి, ఓ రాజకీయ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

నిందితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పుస్తకాల్లో కీలక సమాచారం ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కార్యకర్తలకు శిక్షణతో పాటు ఇతర మతాల ర్యాలీలు, ప్రదర్శనల సమయంలో వాటిలో చొరబడి రాళ్ల దాడి చేసేలా తర్ఫీదు ఇస్తున్నట్లుు గుర్తించారు. నిజామాబాద్‌‌లో శిక్షణ పొందిన వారిలో చాలామంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వారి అచూకీ కోసం గాలిస్తున్నారు.ఈ వ్యవహారంలో 24మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

తదుపరి వ్యాసం