Ponnala Resignation: కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
13 October 2023, 13:47 IST
- Ponnala Resignation: తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఉన్న అసంతృప్తి నేపథ్యంలో పొన్నాల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య
Ponnala Resignation: పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులకు పొన్నాల తన రాజీనామా లేఖను పంపారు. జనగామ డిసిసి నియామకం జరిగినప్పటి నుంచి పొన్నాల మనస్తాపంతో ఉన్నారు. కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చే ప్రయత్నాలు ఆయనను మనస్తాపానికి గురి చేశాయి.
జనగామ పార్టీ టిక్కెట్ పొన్నాలకు వచ్చే అవకాశం లేకపోవడంతోనే పొన్నాల కాంగ్రెస్ పార్టీని వీడినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో కేసీఆర్ సమక్షంలో పొన్నాల బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు చెబుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాలకు తీవ్ర స్థాయిలో అవమానానికి గురి చేసినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని తన లేఖలో ఆరోపించారు.
2018లో కూడా చివరి నిమిషం వరకు తేల్చకుండా తనను అవమానించారని పొన్నాల ఆరోపిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ తరపున జనగామలో గెలుపొందారు. ఈ సారి కూడా పొన్నాలకు టిక్కెట్ దక్కకపోవచ్చని విస్తృత ప్రచారం జరుగుతోంది.
2018 ఎన్నికల్లో జనగామ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండోసారి విజయం సాదించారు. తాజా అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డి స్థానం కోల్పోయారు. తెలంగాణలో గత కొంత కాలంగా జనగామ వ్యవహారం రచ్చగా మారింది. ముత్తిరెడ్డిపై ఆయన కుమార్తె పలు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. రానున్న ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డిని తప్పించి ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.
2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చేర్యాల నియోజకవర్గం రద్దై జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై 28490ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. యాదగిరి రెడ్డిపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చినా భారీ మెజార్టీతో గెలుపొందారు. పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ ఐ పార్టీ చివరి వరకు టిక్కెట్ ఖరారు చేయలేదు. 2018లో జనగామలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ పోటీచేస్తారని భావించారు. చివరికి బిసి నేతగా పొన్నాలకే కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఇచ్చింది.
ముత్తిరెడ్డికి 91036 ఓట్లు రాగా పొన్నాలకు 62546 ఓట్లు వచ్చాయి. జనగామలో ఎస్.ఎఫ్ బి అభ్యర్దిగా పోటీచేసిన లక్ష్మణ్ భీమాకు పదివేలకు ఓట్లు వచ్చాయి.తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం జనగామలో 2014లో కూడా భారీతేడాతో ఓడిపోయారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశించినా, ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీకి అప్రతిష్టగా మారింది.
2014లో పొన్నాల టిఆర్‌ఎస్ అభ్యర్ధి యాదగిరిరెడ్డి చేతిలో 32695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్దిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి 21113 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలిచి నేదురుమల్లి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో గెలిచాక వై.ఎస్. క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. అనంతరం రోశయ్య, కిరణ్ క్యాబినెట్‌లలో మంత్రిగా కొనసాగారు.
2004, 2008 ఉప ఎన్నికలలోను చేర్యాలలో గెలుపొందిన టిఆర్‌ఎస్ నేత కె.ప్రతాపరెడ్డి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో జనగామ నుంచి పోటీచేశారు. 2009లో టిఆర్‌ఎస్ తరపున, 2014లో బిజెపి తరపున పోటీ చేసి ఓటమి చెందారు. జనగామలో ఏడుసార్లు రెడ్లు, ఆరుసార్లు బిసి మున్నూరుకాపు అభ్యర్ధులు గెలిచారు. రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఎస్.సిలు గెలుపొందారు. జనగామలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి తొమ్మిదిసార్లు, సిపిఎం రెండు సార్లు, టిడిపి ఒకసారి, టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి పిడిఎఫ్ గెలిచింది.