Ponguleti On KCR: నమ్మించి గొంతు కోయడం కేసీఆర్‌కు అలవాటేనన్న పొంగులేటి
10 April 2023, 14:38 IST
- Ponguleti On KCR: తనకు పార్టీలో సభ్యత్వమే లేదని జిల్లా పార్టీ అధ్యక్షుడు చెప్పారని, టిఆర్‌ఎస్‌లో సస్పెన్షన్లు ఉండవని ఖమ్మం జిల్లా మంత్రి చెప్పారని, రెండింటిలో ఏది నిజమో పార్టీ నాయకత్వం తేల్చాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. నమ్మించి గొంతు కోయడం కేసీఆర్ నైజమని మండిపడ్డారు.
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Ponguleti On KCR: పార్టీ సభ్యత్వమే లేని తనను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ , కేటీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ పొంగులేటి ఎద్దేవా చేశారు. ఎనిమిదిన్నర ఏళ్లలో తెలంగాణలో ఏమి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని, ఏ తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించారో, అది బూటకమని అర్థమైపోయిందన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వాన్ని వంద రోజుల నుంచి తాను ప్రశ్నిస్తూనే ఉన్నానని, ధైర్యం తెచ్చుకుని సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి బిఆర్‌ఎస్ నాయకుడు కాదని, సభ్యత్వం చూపించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గతంలో చెప్పారని, బిఆర్‌ఎస్‌లో సస్పెన్షన్లు ఉండవు, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని ఇంకో మంత్రి అన్నారని, సభ్యత్వమే లేదని సస్పెన్షన్ ఎలా చేశారని పొంగులేటి ప్రశ్నించారు.
2014లో అధికారంలోకి రావడానికి కావాల్సిన స్థానాలు తగ్గుతాయని భావించి ఫలితాలు రాకముందే, పార్టీలో చేరాల్సిందిగా పదేపదే తన ఇంటికి వచ్చి అభ్యర్థించారని, ఏ పార్టీ నుంచి గెలిచానో అదే పార్టీలో రెండేళ్లకు పైగా కొనసాగానని, వందల సార్లు తనను పార్టీ మారాల్సిందిగా కేసీఆర్, కేటీఆర్ బతిమాలుకున్నారని గుర్తు చేశారు.
2017లో పాలేరులో ఉప ఎన్నికలు జరిగినపుడు, టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి గెలవాలంటే తాను టిఆర్‌ఎస్‌లో ఉంటేను సాధ్యపడుతుందని భావించి, కేటీఆర్ అనేక సందర్భాల్లో తనతో మాట్లాడి కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారని, పార్టీలో చేరక ముందు టిఆర్‌ఎస్‌లో సముచిత స్థానం ఇస్తామని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారి పార్టీలో చేరానని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి టిఆర్‌ఎస్‌లో చేరానని, పాలేరులో కనివిని మెజార్టీతో గెలిపించుకున్నానని చెప్పారు.
తాను పార్టీలో చేరిన తర్వాత సహచర ఎంపీలు తనను ఆటపట్టించే వారని,కొత్త పెళ్లి కొడుక్కి ఆర్నెల్లు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, ఆర్నెల్ల తర్వాత కేసీఆర్ అసలు రూపం తెలుస్తుందని చెప్పేవారని, తనకు మాత్రం ఐదు నెల్లకే కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని పొంగులేటి విమర్శించారు. టిఆర్‌ఎస్ పార్టీలో చేరినపుడు 9జిల్లాల వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, రకరకాల స్థాయిలో ఉన్న వందలాది మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారని గుర్తు చేశారు. తనకు ఎంత ఆవేదన ఉన్నా, అవమానాలు జరిగినా, తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల కోసం భరించానని చెప్పారు. 2019 ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగినట్లు చెప్పారు.
2018 ఎన్నికల్లో ఖమ్మంలో ఒకే ఒక్క అభ్యర్ధి గెలవడానికి కారణం ఏమిటని అధ్యక్ష స్థానంలో ఉన్న వారితో, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ ఏనాడైనా చర్చించారా అని నిలదీశారు. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఎదుటి వారి మీద నింద మోపడం ఎంత వరకు న్యాయమన్నారు. ఖమ్మంలో ఓటమికి కారణం ఎవరనే దానిపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక పరిస్థితి ఏమిటో కేసీఆర్‌కు తెలియదా అని నిలదీశారు. కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తాయని అలాంటి జిల్లాలో బలపడేందుకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి, సముచిత స్థానం కల్పిస్తానని నమ్మి మోసపోయాననిని ఆరోపించారు. పార్లమెంటులో ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చి తననుె మోసం చేశారని, తన కొడుకు పెళ్లికి లక్షలాది మంది జనం రావడం చూసి ఓర్వలేక రాజ్యసభ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కేసీఆర్‌కు ప్రజలు బుద్ది చెబుతారన్నారు.