Nekkonda Station Fight: జర్నీ లేకున్నా, అక్కడ టిక్కెట్లు కొని స్టేషన్‌కు ఊపిరి పోస్తున్నారు…!
12 February 2024, 9:19 IST
- Nekkonda Station Fight: ప్రయాణికులు లేరనే కారణంతో రైళ్ల రాకపోకలు ఆగిపోవడంతో ఆ ఊరి జనం ఏకమయ్యారు. పని ఉన్నా లేకపోయినా టిక్కెట్లు మాత్రం కొంటూ స్టేషన్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రైల్వే స్టేషన్ కోసం ప్రయాణించకుండానే టిక్కెట్ల కొనుగోలు
Nekkonda Station Fight: మొదట సాంకేతిక కారణాలతో రైళ్లు రద్దు చేస్తారు… జనం ప్రత్యామ్నయాాల వైపు మళ్లగానే జనం లేరని హాల్టింగ్ ఎత్తేస్తారు.. ఆ తర్వాత మెల్లగా స్టేషన్లు కనుమరుగై పోతాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోవిడ్ తర్వాత కాలంలో పదుల సంఖ్యలో ఇలాగే గ్రామీణ రైల్వే స్టేషన్లు కనుమరుగై పోయాయి.
ఒకప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడిన స్టేషన్లు కూడా రకరకాల కారణాలతో ఇప్పడు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇలా సికింద్రాబాద్, విజయవాడ రైల్వే డివిజన్ల పరిధిలో పదుల సంఖ్యలో స్టేషన్లను కొన్నేళ్లుగా తొలగిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో ఓ రైల్వే స్టేషన్ మనుగడ కోసం గ్రామస్తులు ఏకమయ్యారు. అవసరం ఉన్నా లేకపోయినా రైల్వే స్టేషన్‌కు తరలి వస్తున్నారు. నిత్యం స్టేషన్‌లో టిక్కెట్లు కొంటున్నారు. ప్రయాణం ఉన్నా లేకపోయినా తమ ఊళ్లో రైల్వే స్టేషన్ కాపాడుకోడానికి చిరు ప్రయత్నం చేస్తున్నారు.
ప్యాసింజర్ రైళ్లతో నష్టాలు తప్ప దమ్మిడీ ఆదాయం ఉండట్లేదని రైల్వే శాఖ తరచూ చెబుతుంటుంది. జనాన్ని తీసుకెళ్లడం కంటే సరుకు రవాణాతోనే కాసిన్ని డబ్బులు కూడబెట్టుకునే ప్రయత్నాలు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖకు కోవిడ్ ఆంక్షలు అందివచ్చాయి.
2020 మార్చిలో లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దశల వారీగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్పెషల్ ట్రైన్స్ పేరిట దశల వారీగా పునరుద్ధరించారు. అయితే రకరకాల సాకులతో ప్యాసింజర్ రైళ్లను ఇప్పటికీ పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. డిమాండ్ ఉన్న మార్గాల్లో మాత్రమే కొన్నింటిని పునరుద్ధరించారు.
ఈ క్రమంలో ప్రయాణికులు లేరంటూ చాలా ప్రాంతాల్లో గ్రామీణ రైల్వే స్టేషన్లలో సిబ్బందిని తొలగిస్తూ వచ్చారు. ప్రతి స్టేషన్‌లో ఉండే స్టేషన్ మాస్టర్, సిగ్నలింగ్ సిబ్బంది, బుకింగ్ స్టాఫ్, ఇతర ఉద్యోగులకు అయ్యే వ్యయం మిగులుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. గత ఏడాది దాదాపు డజనుకు పైగా స్టేషన్లను ఇలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూసేశారు. అక్కడ ఉన్న భవనాలు, మౌలిక సదుపాయాలు క్రమంగా శిథిలమై పోతున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణలోని నెక్కొండ స్టేషన్‌కు కథ కూడా క్లైమాక్స్‌కు వచ్చింది. గతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఈ స్టేషన్‌లో ఆగేవి. ఆ తర్వాత సూపర్ ఫాస్ట్ రైళ్ల శకం మొదలయ్యాక క్రమంగా రైళ్ల రాక తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నెక్కొండ హాల్ట్ ఎత్తేయడంతో గ్రామస్తులు వేడుకోవడంతో తాత్కలికంగా పునరుద్ధరించారు.
తాత్కలిక హాల్ట్ సదుపాయాన్ని కాపాడుకోడానికి నిత్యం రైల్వేస్టేషన్‌లో కనీసం 60 టికెట్లు కొంటున్నారు. ఇలా టిక్కెట్లు కొంటున్నా వాటితో ప్రయాణాలు మాత్రం చేయడం లేదు. తమ ఊరికి గుర్తింపు తెచ్చిన స్టేషన్‌ను కాపాడుకోడానికి గ్రామస్తులు అవసరం ఉన్నా లేకపోయినా స్టేషన్లో టిక్కెట్లు మాత్రం కొనుగోలు చేస్తున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న నెక్కొండ రైల్వే స్టేషన్‌ను సమీప ప్రాంతాల నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిరిడీ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కాజీపేట, వరంగల్ నుంచి ప్రయాణాలు కొనసాగించాల్సి వస్తోంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేకపోవడం మెల్లగా స్టేషన్ కార్యకలాపాలు నిలిచే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు నడుం బిగించారు.
ఆదాయం తగ్గుతోందనే కారణంతో రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో నెక్కొండలో హాల్టింగ్‌ను రద్దు చేశారు. ప్రయాణికుల నుంచి వినతులు రావడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక హాల్టింగ్ కల్పించారు.
మూడు నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టారు. దీంతో హాల్టింగ్ కోల్పోకూడదని భావించిన గ్రామస్తులు 'నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం' పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు.
దాదాపు 400 మంది ఇందులో సభ్యులుగా చేరారు. రైల్వే స్టేషన్ కాపాడుకోడానికి విరాళాల రూపంలో నగదు సేకరించారు. ఈ డబ్బుతో నిత్యం నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు టికెట్లు కొంటున్నారు. నెక్కొండ స్టేషన్ నుంచి రైల్వే శాఖకు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.
రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తే జనం వస్తారో లేదో తెలుస్తుందని రైళ్లే లేకుండా ఆదాయం రావడం లేదని చెప్పడం ఎంత మేరకు సబబని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.