Etala Gajwel Meeting: కేసీఆర్ గజకర్ణ టక్కుటమార మాటల్ని నమ్మొద్దన్న ఈటల
27 October 2023, 6:19 IST
- Etala Gajwel Meeting:గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలలో కెసిఆర్ వస్తారని, హుజురాబాద్ ఎన్నికల తరువాత అయినా కేసిఆర్ బుద్ధి తెచ్చుకోవాల్సి ఉందన్నారు ఈటల రాజేందర్. కెసిఆర్ మద్యం విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తారని, ఎన్నికలు అయ్యే దాకా మీ భర్తలను, పిల్లలను కాపాడుకోండి అని మహిళలను కోరారు.
గజ్వేల్ విజయశంఖారావంలో ఈటల రాజేందర్
Etala Gajwel Meeting: తెలంగాణ ఊళ్లలో కుతిలేస్తే మందు బిళ్ళ దొరకకున్నా మందు సీసా మాత్రం దొరుకుతుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కెసిఆర్ తాగిపించి సంపాదించే సంపాదన వల్ల.. తెగిపడన పుస్తెలతాళ్ళు కనిపించడం లేదా అని ఈటల ప్రశ్నించారు. 25 వేల కోట్లు ఇచ్చి 45 వేల కోట్లు తాగించి గుంజు కుంటున్నారన్నారని గజ్వేల్ విజయ శంఖారావsaసభలోఆరోపించారు.
బిజెపి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా గజ్వేల్ లో అడుగుపెట్టిన ఈటలకు ఘన స్వాగతం లభించింది. 1992 లో గజ్వేల్ నియోజకవర్గంలోని శాకారంలో మొదటి పౌల్ట్రీ పెట్టానని, శిలాసాగర్, రిమ్మనకూడ, కొక్కండలో పౌల్ట్రీలు ఉన్నాయని అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంతో సంబంధముందని ఈటల చెప్పారు.ములుగు ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లోనే 2002లో TRS లో చేరి 20 ఏళ్ల పాటు గజ్వేల్ ప్రజల కళ్లముందు పెరిగిన బిడ్డనని ఈటల చెప్పారు.
2004లో ఎమ్మెల్యే అయ్యాక ఉద్యమాన్ని ఆవిష్కరించడంతో పాటు, అణగారిన వర్గాల గొంతుక అయ్యానని, అశ్వద్ధామ నాయకత్వంలో ఆర్టీసీ సంఘం, గోపాల్ నాయకత్వంలో మున్సిపల్ కార్మికుల సంఘం పెట్టామన్నారు. తెలంగాణ వచ్చాక జీతల కోసం వారు సమ్మె చేస్తే 1700 మున్సిపల్ కార్మికులను తీసివేసిన చరిత్ర కెసిఆర్‌దన్నారు.
పదవి కంటే పేదలే ముఖ్యం…
మంత్రి పదవి ముఖ్యమా, పేదల బ్రతుకులు ముఖ్యమా అంటే.. మంత్రిగా ఉండి కూడా నేను కార్మికులకు మద్దతు తెలిపి వారి ఉద్యోగాలు పెట్టించిన బిడ్డనన్నారు. ఆర్టీసీ కార్మికులు మోకాళ్ళ మీద కూర్చుని మమ్ముల్ని కాపాడాలని కెసిఆర్‌ని అడిగితే బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు వారి ఓట్ల మీద ప్రేమతో వారిని ఇప్పుడు పర్మినెంట్ చేస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు.
కెసిఆర్ అధికారం లేకపోతే బ్రతకలేడని, నియోజకవర్గం లేక గజ్వేల్ కి రాలేదని కెసిఆర్ ను ఓడించడానికే వచ్చానన్నారు.రోషం ఉన్నవాడే ఉద్యమంలో ఉంటారని,రోషం ఉన్నవాడే ధర్మం వైపు ఉంటారని, రోషం ఉన్నవాడే అణగారిన వర్గాలవైపు ఉంటారని, తాను రోషం ఉన్న బిడ్డను కాబట్టే పదవి గొప్పది కాదు ప్రజలే గొప్పవారు అని రాజీనామా చేశానన్నారు.
టిఆర్‌ఎస్‌లో 2004లో.. 50 మంది పోటీ చేస్తే 26 మంది మాత్రమే గెలిచారని, 2008లో 17 మంది పోటీచేస్తే గెలిచింది 7 మంది మాత్రమే గెలిచారన్నారు. 2009లో 50 మంది పోటీచేస్తే పట్టుమని పదిమంది కూడా గెలవలేదు అని విమర్శించింది మర్చిపోయావా అన్నారు.
బిఫాం ఇచ్చిన వాళ్లంతా ఎందుకు గెలవలేదు…
కెసిఆర్ బీ ఫామ్ ఇస్తే, కెసిఆర్ బొమ్మ పెట్టుకుంటే అందరూ గెలవాలి కదా అని ప్రశ్నించిన ఈటల, తాము గెలిచింది నియోజకవర్గ ప్రజల భిక్షతో అని కేసీఆర్ మర్చిపోయాడన్నారు. హుజురాబాద్ లో 6 నెలల పాటు ఎన్నికలు కొట్లాడానని భూమ్మీదనే నరకం చూసానన్నారు. తమ నాయకులు అందరినీ కొనుగోలు చేశారని, ఏ ఊరికి మీటింగ్ కి పోయినా ఆ ఊర్లో జనాలు లేకుండా తీసుకుపోయి దావతులు ఇచ్చి, కరెంటు కట్ చేసే వారని గుర్తు చేశారు..
ఈటల శిఖండితో యుద్ధం చెయ్యడని, ధీరునిగా కొట్లడతాడన్నారు. రాజు తలుచుకుంటే డబ్బులకు కొదువనా అంటున్న కెసిఆర్, గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అందరికీ ఇవ్వలేదన్నారు.
మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని, ఓట్లు వేసి గెలిపించిన పాపానికి గజ్వేల్ లో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కెసిఆర్ డబ్బులు పంపిస్తే తీసుకోవాలని, ప్రమాణం చేయమంటే ముందు లోపల ప్రమాణం చేసుకుని తరువాత వాళ్ళు చెప్పిన ప్రమాణం చేయాలన్నారు.
తన వల్ల సర్పంచ్, ఎంపీటీసీ, పార్టీ కార్యకర్తలకు విలువ పెరిగింది. కూతవేటు దూరంలో ఉన్న కెసిఆర్.. ఒక్క నాడు కూడా ఫామ్ హౌజ్‌కి పిలిచి అన్నం పెట్టారా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఏం ఇచ్చినా తీసుకోవాలని కానీ మీ గౌరవం పెరగడానికి, మీకు డబ్బులు రావడానికి కారణం అయిన నన్ను మాత్రం మర్చిపోవద్దన్నారు.
కేసీఆర్‌ను ఓడించండి….
తాను గరీబుని, బక్కపలచని వాణ్ణని, కెసిఆర్ డబ్బులతో కొట్లడలేనని ఈటల చెప్పారు. ధర్మంతో, న్యాయంతో మాత్రమే కొట్లాడగలనని గజ్వేల్ ప్రజల అండతోనే కొట్లాడగలనన్నారు. ఒక వోటు రెండు పెన్షన్లు ఎంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు అవసరం తెలిసిన బిడ్డనని, ఓట్ల కోసం బీజేపీ మానిఫెస్టో ఉండదన్నారు.
భూస్వాములకు రైతుబందు రాదని, పేదవారికి మాత్రమే ఇస్తామని, కౌలు రైతులకు కూడా సాయం అందించే జిమ్మేదార్ ప్రభత్వం తమదన్నారు. ఒక్క కిలో కూడా తరుగులేకుండా ధాన్యం కొనే జిమ్మేదార్ మాదన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని, గల్ఫ్ కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. ఉద్యోగులు కోల్పోయిన మధ్యంతర భృత ఇస్తామని, రైతుకూలీ చచ్చిపోతే ఒక్క రూపాయి రావడం లేదని, పేదవాడి చనిపోతే 5 లక్షల రూపాయల భీమా సౌకర్యం అందిస్తామన్నారు.
పీడవిరుడుగు కావాలంటే, ఈ బాధలనుండి విముక్తి కావాలంటే ఓటు హక్కు ద్వారానే సాధ్యమని, నిండు మనసుతో ఆశీర్వదించి, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలన్నారు. సభ అనంతరం బిజెపి లో చేరిన గడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన జస్వంత్ రెడ్డి, మాజీ AMC చైర్మన్ రాంరెడ్డి, పెద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, సింగం సత్తయ్య, నర్సింహరెడ్డి, చెట్టి సురేష్, రామచంద్రం, ఆరే పెంటయ్య, అప్పాల మల్లేష్, సుభాష్ చంద్రబోస్, రాజిరెడ్డి, బిక్షపతి, హైదర్, అనూప్, సత్యనారయణ, పూల సత్యనారాయణ గార్లతో పాటు చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.