Edupayala Durgamma Jatara: ఏడుపాయల జాతర… శివరాత్రి నుంచి మూడ్రోజుల నిర్వహణ… భారీగా తరలి రానున్న భక్తులు
06 March 2024, 7:45 IST
- Edupayala Durgamma Jatara: ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ దుర్గామాత ఆలయంలో శివరాత్రి నుంచి మూడ్రోజుల పాటు జాతర నిర్వహణకు సిద్ధమైంది.
మెదక్ ఏడుపాయల దుర్గమ్మ జాతరకు సిద్ధం
Edupayala Durgamma Jatara: ఏడుపాయల దుర్గామాత దేవాలయం మెదక్ Medakజిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉంది. ఏడూ ఉప నదులు కలిసి గోదావరి Godavari నదికి ఉపనది అయినా మంజీరాManjeera River నదిలో కలుస్తాయి. అందుకే దీనికి ఏడుపాయల అనే పేరు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో ఈ నెల 8 నుండి 10 వరకు మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
మెదక్ జిల్లా కేంద్రం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఆలయం ఉంటుంది. మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకోదగినది. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంజీరా నదిలో పుణ్యస్థానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఆలయానికి సంబంధించిన పురాణ కథ మహాభారతం నాటిది. అర్జునుడి మనుమడు జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజు సర్పకాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు.
దీనికి జమదగ్ని,అత్యేయ ,కశ్యపి,విశ్వమిత్ర,వశిష్ట,గౌతమి,భరద్వాజ వంటి సప్తఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. దీని ఫలితంగా పాములన్ని అగ్నికి ఆహుతి అవుతుండడంతో భయపడి సర్పజాతి దేవుళ్లను వేడుకున్నదట. అప్పుడు సర్పజాతికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు పాతాళంలోని గంగను ఇక్కడికి తీసుకువచాడని అంటారు.
యజ్ఞం చేస్తున్న స్థలానికి రాగానే గంగానది ఏడుపాయలుగా చీలిపోయిందట. అందులో ఒక పాయ సర్పయాగ గుండాలను ముంచుతూ గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకి గోదావరిలో కలిసిందట. అప్పుడు గంగానది ఏడు పాయలుగా చీలిపోవడం,ఏడుగురు ఋషులతో యాగం చేయడం వలన దానికి ఏడుపాయల అని,అక్కడ దుర్గామాత కొలువై ఉండటం వలన అమ్మవారికి ఏడుపాయల దుర్గామాతగా చరిత్రకెక్కింది.
మూడు రోజుల పాటు జాతర నిర్వహణ…
శివరాత్రి సందర్భంగా ఏడుపాయల వన దుర్గ భవాని జాతర అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఉత్సవాలు ఏర్పాట్లు చేయాలని, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అధికారులకు సూచించారు.
ఏడుపాయల అమ్మవారికి,మెదక్ ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, అధికారులు భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి శివరాత్రి సందర్భంగా 03 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. ఇక్కడ 8న మహాశివరాత్రి ఉత్సవాలు,9న బండ్లు తిరుగుట,10న రథోత్సవం వైభవంగా జరుగుతాయి.
లక్షలాదిగా భక్తుల రాక…
ఈ ఏడాది 7 లక్షల మంది భక్తులు దుర్గ భవాని మాతను దర్శించుకుంటారని ప్రాథమిక అంచనా వేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయవలసినదిగా అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అని అన్నారు.
అధికారులు సమిష్టిగా, సమన్వయంతో ఈ నాలుగు రోజులు మరింత కష్టపడి పనిచేయాలని, సమయం దగ్గర పడుతున్నందున అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. భక్తి ,సామాజిక విలువలు, సంస్కృతి, పెంపొందిచేటట్లుగా అనేక రకాల సామాజిక కార్యక్రమాలు ,సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. భక్తిని ఉట్టిపడే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు.
(హిందుస్తాన్ టైమ్స్ మెదక్ జిల్లా ప్రతినిధి)