తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  National Herald Case: టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు.. హైకమాండ్ నుంచి పిలుపు!

National Herald case: టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు.. హైకమాండ్ నుంచి పిలుపు!

HT Telugu Desk HT Telugu

30 September 2022, 15:44 IST

    • ED On National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

ED Notices to Telangana Cogress Leaders: నేషనల్ హెరాల్డ్ కేసు.... కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి ఈడీ సమన్లు పంపింది. పలుమార్లు విచారణ కూడా జరపగా... అగ్రనేతలు స్వయంగా హాజరయ్యారు. దీనిపై బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుండగా... హస్తం నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే... తాజాగా ఈ వ్యవహరం తెలంగాణ కాంగ్రెస్ నేతల వరకు చేరింది.

నేషనల్ హెరాల్డ్​ పత్రికకు సంబంధించి దూకుడు పెంచిన ఈడీ... పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది. షబ్బీర్‌ అలీ , సుదర్శన్‌రెడ్డి , అంజన్‌కుమార్‌ యాదవ్‌ ,రేణుకాచౌదరి, గీతారెడ్డితో పాటు పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపురావటంతో పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు.

శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా విరాళమిచ్చిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. కేసు పూర్వాపరాల గురించి కాంగ్రెస్ అధిష్ఠానం పలు వివరాలను అందజేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది.


మరోవైపు నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో హ‌వాలా లావాదేవీల‌కు సంబంధించిన కీల‌క ఆధార‌ల‌ను ఈడీ సేక‌రించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కు సంబంధించిన వారికి,ఈ సంస్థ‌తో సంబంధం లేని మూడో వ్య‌క్తుల‌కు జ‌రిగిన ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన ఆధారాల‌ను ఈడీ గుర్తించింది. ముఖ్యంగా ముంబై, కోల్‌క‌తాల్లోని హ‌వాలా ఆప‌రేటర్ల‌తో జ‌రిగిన లావాదేవీల వివ‌రాల‌ను, సంబంధిత ప‌త్రాల‌ను ఈడీ సేక‌రించింది. ఢిల్లీలోని హెరాల్డ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాల‌యంలో కూడా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విచారించారు.

టాపిక్

తదుపరి వ్యాసం