National Herald case: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో బ‌య‌ట‌ప‌డిన‌ హ‌వాలా లింకులు-nh case ed unearths hawala link re examining sonia rahul gandhi s statements ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Herald Case: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో బ‌య‌ట‌ప‌డిన‌ హ‌వాలా లింకులు

National Herald case: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో బ‌య‌ట‌ప‌డిన‌ హ‌వాలా లింకులు

HT Telugu Desk HT Telugu
Aug 04, 2022 03:28 PM IST

National Herald case: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కీల‌క‌మైన ముంద‌డుగు వేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్‌, యంగ్ ఇండియ‌న్ క్ర‌య విక్ర‌య లావాదేవీల్లో అక్ర‌మ న‌గ‌దు చెలామ‌ణికి సంబంధించిన కీల‌క ఆధారాల‌ను గుర్తించింది.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

National Herald case: నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈడీ ద‌ర్యాప్తు శ‌ర‌వేగంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల‌ను విచారించిన అనంత‌రం ద‌ర్యాప్తును ఈడీ మ‌రింత వేగ‌వంతం చేసింది.

Hawala links: హ‌వాలా లింకులు

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో హ‌వాలా లావాదేవీల‌కు సంబంధించిన కీల‌క ఆధార‌ల‌ను ఈడీ సేక‌రించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కు సంబంధించిన వారికి,ఈ సంస్థ‌తో సంబంధం లేని మూడో వ్య‌క్తుల‌కు జ‌రిగిన ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన ఆధారాల‌ను ఈడీ గుర్తించింది. ముఖ్యంగా ముంబై, కోల్‌క‌తాల్లోని హ‌వాలా ఆప‌రేటర్ల‌తో జ‌రిగిన లావాదేవీల వివ‌రాల‌ను, సంబంధిత ప‌త్రాల‌ను ఈడీ సేక‌రించింది.

Young Indian: `యంగ్ ఇండియ‌న్` లో సోదాలు

ఢిల్లీలోని హెరాల్డ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాల‌యంలో సోదాలు పూర్త‌యిన అనంత‌రం సంబంధిత హ‌వాలా లావాదేవీల‌పై ఈడీ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశ‌ముంది. బుధ‌వారం యంగ్ ఇండియ‌న్ ఆఫీస్‌లో సోదాలు చేయ‌డానికి వెళ్లిన ఈడీ అధికారుల‌కు, అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో, కార్యాల‌యాన్ని సీజ్ చేసి, వ‌చ్చేసింది. గురువారం తిరిగి సోదాల‌ను కొన‌సాగిస్తోంది.

Summons to Rahul and sonia : మ‌ళ్లీ రాహుల్, సోనియా విచార‌ణ‌

గ‌తంలో విచార‌ణ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇచ్చిన స‌మాధానాల‌తో త‌మ‌కు దొరికిన ఆధారాల‌కు పొంత‌న కుద‌ర‌ని నేప‌థ్యంలో.. వారిద్ద‌రిని మ‌రోసారి విచారించాల‌ని ఈడీ యోచిస్తోంది. ఒక‌వేళ‌, అదే జ‌రిగితే, కాంగ్రెస్ పార్టీ ఆ విష‌యాన్ని అత్యంత తీవ్రంగా తీసుకునే అవ‌కాశ‌ముంది.

అయితే, మ‌ళ్లీ వారిని విచారించే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కైతే నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ప్ర‌స్తుతానికి గ‌తంలో రాహుల్‌, సోనియా ఇచ్చిన స‌మాధానాల‌ను ఈడీ పునః ప‌రిశీలిస్తోంద‌ని స‌మాచారం. నేష‌న‌ల్ హెరాల్డ్‌, యంగ్ ఇండియ‌న్‌ల మ‌ధ్య జ‌రిగిన ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌ను మోతీలాల్ ఓరా మాత్ర‌మే తీసుకున్నార‌న్న రాహుల్, సోనియా వాద‌న‌ల‌ను ఈడీ విశ్వ‌సించ‌డం లేదు.

IPL_Entry_Point