Delhi Liquor Scam : రూ.100 కోట్లు ఇచ్చారు.. ఈడీ ఛార్జిషీట్‌లో కవిత పేరు!
21 December 2022, 7:24 IST
- Delhi Liquor Scam Kavitha Name : దిల్లీ లిక్కర్ స్కామ్ దుమారం రేపుతోంది. ఈ కేసులో ఈడీ వేసిన మరో ఛార్జిషీట్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది. ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్ రెడ్డి, కవిత అని పేర్కొంది.
ఎమ్మెల్సీ కవిత
దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అత్యధికంగా లబ్ధి పొందిన వారిలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దిల్లీ లిక్కర్ కేసులో ఈడీ వేసిన మరో ఛార్జి షీట్లో కీలక విషయాలను ప్రస్తావించింది. సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జి షీట్లో కవితతోపాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శీనివాస్ రెడ్డి, అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పాత్రలను చెప్పింది. అయితే ఈ కేసులో బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపింది.
ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అని ఈడీ కోర్టుకు చెప్పింది. ఈ సంస్థకు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు సైతం వాటా ఉందని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్‌లో రామచంద్ర పిళ్లై వెనక ఉన్నది కవిత అని ఈడీ తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని వెల్లడించింది. రిటైల్‌లో 14 కోట్ల బాటిళ్లను విక్రయించడం ద్వారా కనీసం రూ. 195 కోట్ల సంపాదించినట్టుగా ఈడీ పేర్కొంది.
పైన చెప్పిన ముగ్గురి నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ కు 100 కోట్ల ముడుపులు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఇదంతా ఆప్ నేతల మధ్య కుదిరిన డీల్ గా వెల్లడించింది. ఇందులో భాగంగానే ముందస్తుగా 100 కోట్లు చెల్లించినట్టుగా పేర్కొంది. ఈ వంద కోట్ల వసూలుకు వీలుగానే.. ఇండోస్పిరిట్ లోని 65 శాతం వాటను సౌత్ గ్రూప్ నుకు ఇచ్చినట్టుగా ఈడీ చెబుతోంది. ఈ వాటను అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీలతో నడిపించారని ఛార్జ్ షీట్లో ఈడీ తెలిపింది.
ఛార్జిషీట్ ప్రకారం.., కవిత నేరుగా దిల్లీలోని స్టార్ హోటళ్లలో, హైదరాబాద్‌లోని తన నివాసంలో లేదా కాల్స్ ద్వారా వారిని కలుసుకోవడం, నిరంతరం టచ్‌లో ఉన్నారని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను చెరిపేసేందుకు దాదాపు డజను మొబైల్ ఫోన్‌లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.