తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rain Alert: తెలంగాణలో కుండపోత.. మరో రెండ్రోజుల బళ్లకు సెలవులు

TS Rain Alert: తెలంగాణలో కుండపోత.. మరో రెండ్రోజుల బళ్లకు సెలవులు

HT Telugu Desk HT Telugu

26 July 2023, 8:37 IST

google News
    • TS Rain Alert: తెలంగాణలో రాగల మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
హైదరాబాద్‌లో వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్న ప్రజలు
హైదరాబాద్‌లో వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్న ప్రజలు (PTI)

హైదరాబాద్‌లో వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్న ప్రజలు

TS Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవచ్చని ఐఎండి తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో సెల్‌ఫోన్లు వాడొద్దని రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న సూచించారు. ఉరుములు, మెరుపులు బారిన పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కరెంట్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని, పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలని సూచించారు. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దని కోరారు.

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వివరించారు.

కొన్ని జిల్లాల్లో వర్షాలతోపాటు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో గంటకు నాలుగైదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

రాష్ట్రమంతటా వానలే వానలు…

ఎడతెరిపిలేని వానలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం రాష్ట్రంలో సగటున 4.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిజామాబాద్‌తోపాటు జనగాం, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైన తర్వాత తొలి నెల రోజుల పాటు వర్షపాతం లోటు ఉండగా.. గత వారం రోజుల్లో అధిక వర్షపాతానికి చేరింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఏకంగా 60శాతం అధికంగా వానలు పడగా.. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, వరంగల్, కొమురంభీం, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జగిత్యాల, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిగతా ఎనిమిది జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి.

బంగాళాశాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీనికితోడు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తదుపరి వ్యాసం