BJP Vs BRS : దుబ్బాక ఓటర్లకు గిఫ్టులతో గాలం, ఇంతకీ పంపిణీ చేసిందెవరంటే?
01 October 2023, 17:17 IST
- BJP Vs BRS : ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరిట ప్రజలకు గిఫ్టులు అందిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
దుబ్బాకలో గిఫ్టుల పంపిణీ
BJP Vs BRS : ఎన్నికలు వచ్చాయంటే, ఓటర్లని ఆకర్షించడానికి వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు రకరకాల బహుమతులు ఇస్తూంటారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, దుబ్బాక నియోజకవర్గంలో ఈ గిఫ్ట్ ల హడావుడి మొదలయ్యింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచరులు ప్రజలకు గిఫ్ట్ లు ఉన్న సంచులు ఆటోల నిండా నింపుకొని దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆదివారం పొద్దున్నే పంపిణీ చేస్తున్నారని అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రఘనందన్ రావు బొమ్మ ఉన్న సంచిలో ఒక చీర, ఒక గొడుగు గిఫ్ట్ ను ఇంటి ఇంటికి బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇలా పంపిణీ చేస్తున్న గిఫ్టులను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు ఫొటోలు తీసి ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. గొడుగుపైన రఘునందన్ రావు ఫొటో, పార్టీ సింబల్ కమలం పువ్వు గుర్తు ఉన్నాయి. అదే విధంగా సంచి పైన కూడా, రఘునందన్ రావు బొమ్మ, పార్టీ గుర్తు ఉన్నాయి. ఈ ప్యాక్ మొత్తానికి సుమారుగా రూ .500 అవుతుందని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ గిఫ్టుల ఫొటోలు, వీడియోలతో ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ECI) కి ఫిర్యాదు చెయ్యాలని చూస్తున్నారు. తొగుట మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు ఈ గిఫ్టులను పంపిణీ చేశారు. ఆ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ఈ విషయాన్ని నాయకులకు చెప్పడంతో హుటా హుటిన మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామ్ రెడ్డి అక్కడి వచ్చి చూశారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రఘునందన్ రావు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రంలోపు బీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి రఘునందన్ రావు పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఓటమి భయంతోనే
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ తరపున 2020 ఉపఎన్నికల్లో పోటీ చేసిన రఘనందన్ రావు, సుమారు 1,000 ఓట్ల ఆధిక్యతతో సోలిపేట సుజాత పైన గెలిచారు . ఇక్కడి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిన సోలిపేట రామలింగారెడ్డి 2020లో అనారోగ్యం కారణంగా మృతి చెందటంతో ఆయన భార్య సుజాతకు ఉపఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. 2023 ఎన్నికల్లో దుబ్బాక సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రూపంలో గట్టి అభ్యర్థిని సీఎం కేసీఆర్ బరిలోకి దించారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం రఘునందన్ రావుకు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాకముందే ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.