Double Decker Buses | ఎప్పుడో 2006లో కనుమరుగు.. మళ్లీ భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు..
13 March 2022, 15:05 IST
- డబుల్ డెక్కర్ బస్సులో తిరిగితే ఎంత ఆనందం కదా. ఇక మరికొన్ని రోజుల్లో ఆ బస్సులో భాగ్యనగర రోడ్లపైకి రానున్నాయి. ఒకప్పుడు అంటే 2006లో కనిపించేవి. మళ్లీ ఇప్పుడు మంత్రి కేటీఆర్ కృషితో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ లో నడవనున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ చూసేందుకు.. విదేశాల నుంచి సైతం టూరిస్టులు వస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని.. ప్రజలైతే.. ఎప్పుడూ హైదరాబాద్ లో తిరిగుతూనే ఉంటారు. ఎంత తిరిగినా.. మళ్లీ.. మళ్లీ చూడాలనిపించే సిటీ. ఆ చూడటమేదో.. డబుల్ డెక్కర్ బస్సులో తిరిగిదే... వచ్చే మజానే వేరు. 2006లో భాగ్యనగర రోడ్ల మీద ఈ బస్సులు నడిచేవి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా జూపార్కు వరకు, సికింద్రాబాద్ టూ అఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్ టూ మెహిదీపట్నంలాంటి రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్లు చూసుకునేవారు. అయితే ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడువనున్నాయి. దీనికోసం మంత్రి.. కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఆర్టీసీ సేవలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను సరిగా చూసుకుంటున్నారు. అయితే.. మరో ముందడుగు వేసి.. డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ కొనాలి అనుకుంది. కానీ నిధుల కొరత. ఈ కారణంగా వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఈ విషయంపైనే... మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. బస్సుల కొనుగోళ్ల కోసమని రూ.10 కోట్ల ప్రకటించారు. హెచ్‌ఎండీఏ నుంచి ఈ నిధులను సమకూర్చనున్నట్టు చెప్పారు. ఇక.. డబుల్ డెక్కర్ పై ఆశలు మళ్లీ చిగురించాయి.
డబుల్ డెక్కర్ బస్సులపై అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సమాధానం ఇచ్చారు.
నగర వాసులు, టూరిస్టుల కోసం ట్యాంక్ బండ్ పై ఆదివారం సాయంత్రం వాహనాలకు అనుమతి లేకుండా... గతంలో కేటీఆర్ చర్యలు తీసుకున్నారు. దానిపై కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. భాగ్యనగర అందాలను చూపించేందుకు డబుల్ డెక్కర్ బస్సులపైనా.. కేటీఆర్ గతంలో ఆలోచన చేశారు. రెండేళ్ల కిందట ఈ ప్రతిపాదనలు చేశారు. ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ విషయంపైన ఆర్టీసీ కూడా ప్రణాళికలు చేసింది. రూట్ సర్వే, బస్సుల కొనుగోళ్ల టెండర్లకూ ఆహ్వానాలు పంపగా.. పలు కంపెనీలు ముందుకు వచ్చాయి.
పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు.. ప్లాన్ చేసినా.. నిధుల కొరత కారణంగా ఆర్టీసీ వెనక్కు తగ్గింది. మరో వైపు ఆ సమయంలోనే కరోనా పిడుగు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల కొనుగోళ్లతో సంస్థను మరింత వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొన్ని రోజులు ఈ విషయం కనుమరుగైపోయింది. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ డబుల్ డెక్కర్ బస్సులపై ప్రకటించారు. తమ శాఖ నుంచి 10 డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోళ్లకు నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఇవే రూట్లు..
డబుల్ డెక్కర్ బస్సుల కోసం గతంలో మూడు రూట్ల ఎంపిక జరిగింది. పటాన్‌చెరు–కోఠి, జీడిమెట్ల– సీబీఎస్, అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం రూట్లలో డబుల్ డెక్కర్‌లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు చేశారు. టెండర్లు ఆహ్వానించి.. నిధుల కొరతతో కొనుగోళ్లను ఆపేశారు. ఇక మళ్లీ మంత్రి కేటీఆర్ కృషితో కొనుగోలు చేయనున్నారు. హైదరాబాద్ చూడాలనుకునేవారికి డబుల్ డెక్కర్ బస్సులు మంచి అనుభూతిని కలిగిస్తాయి.