Donkey Milk Price : గాడిదను చులకనగా చూస్తారు కానీ.. దాని లీటర్ పాల ధర తెలుసా?
18 July 2022, 18:10 IST
- గాడిద అంటే.. బరువులు మోసేందుకే అని అనుకుంటారు చాలామంది. తిట్టేప్పుడు కూడా.. గాడిదతో పోలుస్తూ.. చులకన చేస్తారు. కానీ గాడిద పాలు ఎంత ధరో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.
ప్రతీకాత్మక చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైనను నేమి ఖరము పాలు.. అనే పద్యాన్ని చిన్నప్పుడు వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పద్యాన్ని తిప్పి పాడుకోవాలేమో. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన బాలాజీ.. సంగారెడ్డి జిల్లాకు వచ్చాడు. కోహీర్ పట్టణంలో గాడిద పాలు అమ్ముతున్నాడు. ఒక చిన్న అమృతాంజనం సీసా పాలు అంటే సుమారు 10ఎంఎల్ రూ.100కు విక్రయిస్తున్నాడు.
గాడిద పాలు తాగితే దీర్ఘకాలికంగా వేధిస్తున్న రోగాలు పోతాయని చెప్పుకుంటారు. ఇదే ఇప్పుడు వారికి మంచి బిజినెస్ అయింది. చాలామంది ఎక్కడ గాడిద పాలు దొరుకుతాయా అని చూస్తున్నారు. గాడిద పాలలో దగ్గు, దమ్ము, మూర్ఛ వంటి వ్యాధులను తగ్గించే శక్తి ఉందని ప్రచారం ఉంది. అందుకోసమే.. దాని లీటర్ పాలు రూ.10 వేలకు అమ్ముడుపోతున్నాయి. గాడిద కొనాలంటే.. రూ. 10 వేలు ఉండేది.. కానీ ఇప్పుడు దానీ లీటర్ పాలే.. అంత ధర పలుకుతున్నాయి.
వ్యాధులు నయం చేయడంతో పాటు శరీరం ధృడంగా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయని బాలాజీ చెబుతున్నాడు. గాడిద పాలకు డిమాండ్ పెరగడంతో గాడిదలు కూడా ఎక్కువ ధరకే దొరుకుతున్నాయట. అంతకుముందు రూ.10వేల నుంచి 15వేల రూపాయలు పలికిన గాడిద ధరలు.. ఇప్పుడు 40వేల నుంచి 50వేల రూపాయలు అంటున్నారని బాలాజీ అన్నాడు.
గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. శిశువులకు ఇవి పట్టించడం మంచిదని చెబుతుంటారు. కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇవి తాగితే.. శరీరానికి కేలరీలు, విటమిన్-డీ ఎక్కువగా అందుతాయి. ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తుంటారు. గాడిద పాలలోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాడిద పాలలో లాక్టోస్ ఉంటుంది. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి.. ఎముకలను బలంగా చేస్తుంది.