Sridhar babu: పెద్దపల్లిలో 165 మహిళా సంఘాలకు రూ.20.67 కోట్ల బ్యాంక్ లింకెజ్ యూనిట్ల పంపిణీ
22 August 2024, 9:20 IST
- Sridhar babu: మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని మహిళలు వ్యాపారాలలో రాణించి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
మహిళా సంఘాలకు రుణాలను పంపిణీ చేస్తున్న శ్రీధర్ బాబు
Sridharbabu: మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని మహిళలు వ్యాపారాలలో రాణించి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సింగిల్ యూసెజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటనతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించి వచ్చే 5 ఏళ్ళలో లక్ష కోట్ల బ్యాంకు రుణాలు అందజేసి మహిళలచే వివిధ వ్యాపార వాణిజ్య యూనిట్ల స్థాపనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో పాపుల వడ్డీ పథకాన్ని ప్రారంభించి స్వ శక్తి మహిళా సంఘాల సభ్యులను లక్షాదికారులను చేశామని మంత్రి గుర్తు చేశారు.
మంథని లో మహిళలచే రూ.40 లక్షలతో మైక్రో ఎంటర్ప్రైజెస్..
మంథని ప్రాంతంలో 40 లక్షల వ్యయంతో 25 మహిళా సంఘాలచే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం 165 మహిళా సంఘాలకు 20 కోట్ల 67 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం పంపిణీ చేస్తున్నామని, వీటినీ మహిళలు వినియోగించుకుని వ్యాపార రంగంలో ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలచే 12 రకాల వాణిజ్య వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు గుర్తించామని, మార్కెట్ లో డిమాండ్ ప్రకారం వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సింగల్ యూజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు
మంథని ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సింగిల్ యూసెజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. డయాలసిస్ సేవలు అందుకుంటున్న రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల స్టాక్ ముందస్తుగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండేలా వైద్యులు సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. మారుమూల మంథని ప్రాంత ప్రజలు డయాలసిస్ కోసం ఎక్కడికో వెళ్ళకుండా మహాదేవపూర్ తో పాటు మంథనిలో రెండు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)