Indian student Missing: అమెరికాలో తెలంగాణ విద్యార్ధిని నితీష కందుల అదృశ్యం, ఆందోళనలో కుటుంబం
03 June 2024, 12:11 IST
- Indian student Missing: అమెరికాలో మరో భారతీయ విద్యార్ధిని అదృశ్యమైంది. గత నాలుగురోజులుగా బోధన్‌కు చెందిన కందుల నితీషా అనే విద్యార్ధిని కనిపించకుండా పోవడంతో బంధువులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో అదృశ్యమైన నితీషా కందుల
Indian student Missing: అమెరికాలో మరో భారతీయ విద్యార్ధిని అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. గత నాలుగు రోజులుగా బోధన్‌కు చెందిన నితీషా కందుల అనే యువతి కనిపించకుండా పోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న నితీషా అచూకీ కోసం ఆమె బంధువులు, స్నేహితులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు
అమెరికాలో గత కొద్ది నెలలుగా భారతీయ విద్యార్ధులు ప్రమాదాలకు గురవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాలిఫోర్నియాస్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని గతవారం అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
బోధన్‌కు చెందిన నితీషా కందుల శాన్ బెర్నిడోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మే 28వ తేదీ నుంచి ఆమె కన్పించకుండా పోయింది. దీంతో మే 31నుంచి ఆమె కోసం స్నేహితులు గాలిస్తున్నారు.
నితీషా చివరిసారి ఆమె లాస్ ఏంజిల్స్‌లో కన్పించినట్లు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. నితీషా అచూకీ కోసం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టాు. ఆమె అచూకీ గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులకు సూచించారు.
కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినో (సీఎస్ యూఎస్ బీ)లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న నితీషా కందుల మే 28న కనిపించకుండా పోయింది. మే 30వ తేదీ నుంచి నితీషా కనిపించకుండా పోయిందని యూనివర్శిటీ చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుటిరెజ్ ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
నితీషా కందుల ఆచూకీ గురించి సమాచారం ఉన్న ఎవరైనా తమను సంప్రదించాలని (909) 537-5165 నంబరు వివరాలు అందివ్వాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఉన్నవారు (909) 538-7777 వద్ద లేదా (213) 485-2582 వద్ద ఎల్ఎపిడి సౌత్ వెస్ట్ డివిజన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
కందుల నితీషా ఐదున్నర అడుగుల ఎత్తుతో నల్లటి జుట్టు, నల్లని కళ్ళతో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్ తో ఉన్న టయోటా కరోలా కారును నడుపుతోందని పేర్కొన్నారు.
గత నెలలో చికాగోలో రూపేష్ చంద్ర చింతకింద్ (26) అనే భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. మార్చి నుంచి కనిపించకుండా పోయిన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు. హైదరాబాద్ నాచారానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గత ఏడాది మే నెలలో అమెరికాకు వచ్చాడు. మార్చిలో మిస్సోరీలోని సెయింట్ లూయిస్ లో భారత్ కు చెందిన 34 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్ నాథ్ ఘోష్ ను కాల్చి చంపారు.
పర్డ్యూ యూనివర్శిటీలో భారతీయ అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ (23) ఫిబ్రవరి 5న ఇండియానాలోని ప్రకృతి సంరక్షణ కేంద్రంలో శవమై కనిపించాడు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్ లోని ఓ రెస్టారెంట్ బయట జరిగిన దాడిలో భారత సంతతికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా ప్రాణాలు కోల్పోయారు.
జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ విద్యార్థి అకుల్ ధావన్ (18) క్యాంపస్ భవనం వెలుపల అపస్మారక స్థితిలో కనిపించాడు. తీవ్రమైన ఆల్కహాల్ మత్తు, అత్యంత శీతల ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం అతని మరణానికి గణనీయంగా దోహదం చేసిందని అధికారులు నిర్ధారించడంతో అతను అల్పోష్ణస్థితి కారణంగా మరణించినట్లు దర్యాప్తులో తేలింది.
గత నెల తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియ లేదు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్ కన్పించకుండా పోయాడు. ఆ తర్వాత నెల రోజులకు క్లీవ్‌లాండ్‌లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. క్లీవ్‌లాండ్‌లోని ఓ డ్రగ్ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్ చేసి.. అతడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.