తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Election 2023 : ఆ ఇద్దరి నేతల పోటాపోటీ ప్రచారం.. అయోమయంలో 'హుస్నాబాద్' కాంగ్రెస్!

Telangana Election 2023 : ఆ ఇద్దరి నేతల పోటాపోటీ ప్రచారం.. అయోమయంలో 'హుస్నాబాద్' కాంగ్రెస్!

HT Telugu Desk HT Telugu

15 October 2023, 7:08 IST

google News
    • Telangana Election 2023: టికెట్ ఖరారు కాకపోవటంతో హుస్నాబాద్ కాంగ్రెస్ డైలామా నెలకొంది. ఇద్దరు నేతలు ఎవరికి వారుగా ప్రచారం చేసుకోవటం ఓవైపు ఉంటే… మరోవైపు కామ్రేడ్లతో పొత్తు కుదిరితే, ఈ సీటును ప్రధానంగా కోరనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Election 2023 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం కొనసాగిస్తుంది. అయితే మిగిలిన పార్టీల పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నచందంగా మారిందనే చెప్పవచ్చు. అధికార పార్టీ అభ్యర్థిగా ఒడితెల సతీష్ బాబును కేసీఆర్ ముందస్తు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనే ప్రకటించగా...ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు వారి అభ్యర్థులను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు.

మాజీ ఎంపీనా ,మాజీ ఎమ్మెల్యేనా...

తెలంగాణా రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకంగా పోరాడిన వ్యక్తుల్లో పొన్నం ప్రభాకర్ ఒకరు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసినా కూడా జై తెలంగాణా అంటు నినదించిన పొన్నం ప్రభాకర్ ఈ సారి పార్లమెంట్ అభ్యర్థిగా కాకుండా హుస్నాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల రోజులనుండి హుస్నాబాద్ కేంద్రంగా నివాసముంటు గ్రామగ్రామాన తిరుగుతూ..ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి స్థానికంగా బలమైన నాయకుడు కావడంతో పాటు ప్రజల్లో మంచి ఆదరణ ఉండగా… పొన్నం హుస్నాబాద్ కు వచ్చి పోటీ చేయడం పై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రవీణ్ రెడ్డి గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకుంది. ఎవరివైపు మొగ్గు చూపాలా.. ఎవ్వరితో ప్రచారం చేయాలా అనే మీమాంసలో కాంగ్రెస్ శ్రేణులు రెండుగా చీలిపోయారు. ఎట్టి పరిస్థితిలో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన అనుచరులు.

వామపక్షాల పొత్తుపై తకరారు

వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే హుస్నాబాద్,బెల్లంపల్లి సీట్లు ఖచ్చితంగా కేటాయించాలనే డిమాండ్ ముందు నుండి ఉండగా… సీపీఐ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చాడవెంకట్ రెడ్డి బరిలో దిగనున్నారు.దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా… పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,చాడ వెంకట్ రెడ్డి ఇద్దరు...హుస్నాబాద్ నియోజకవర్గం నుండి గతంలో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండగా….వీరిద్దరిని కాదని పొన్నం కు సీట్ కేటాయిస్తారా అనే అనుమానం అందరిలో బలంగా నాటుకుంది.

రిపోర్టర్ : గోపికృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా

తదుపరి వ్యాసం