Long Distance Trains : అటెన్షన్…. ఈ రైళ్లకు గమ్యస్థానాలు మారిపోయాయి….
10 December 2022, 7:03 IST
- Long Distance Trains తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రైళ్లను పొడిగించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చొరవతో పలు రైళ్లను ఇకపై జిల్లా కేంద్రాల నుంచి నడిపేలా నిర్ణయించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఈ రైళ్లు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
పలు రైళ్లకు ప్రారంభ స్థానాలు మార్పు
Long Distance Trains దేశంలోని పలు ప్రాంతాల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లను పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు జోనల్ రైల్వే అధికారులకు సమాచారాన్ని పంపారు. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రైళ్లను విస్తరించాలని ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సానుకూల స్పందన లభించింది. షిర్డీ, జైపూర్, హుబ్బళ్లి వంటి అధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే ప్రయాణికులకు వీలుగా ఉండేలా ఈ రైళ్లను ప్రస్తుత కేంద్రాల నుంచి కాకుండా జిల్లా కేంద్రాల నుంచి గమ్య స్థానాలకు నడుపనున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలంటే గతంలో ప్రధాన నగరాల వరకు వెళ్లాల్సి వచ్చేది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ, సికింద్రాబాద్ నుంచి మాత్రమే ఎక్కువ రైళ్లు ప్రయాణించేవి. ఇకపై ఈ ఇబ్బందులు ప్రయాణికులకు తప్పనున్నాయి. మచిలీపట్నం, కర్నూలు, మహబూబ్ నగర్, వరంగల్ వంటి జిల్లా కేంద్రాల నుంచి రైలు ప్రయాణాలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.
మొత్తం 10జతల రైళ్లను ప్రయాణికులకు వీలుగా పొడిగిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా రైళ్లను పొడిగించాలని ప్రతిపాదనలు ఉన్నా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలోకేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైళ్లను పొడిగించాలని కోరడంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్శినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.
ట్రైన్ నంబర్ 19713/19714 సికింద్రబాద్-జైపూర్ మద్య నడిచే రైలు ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి ప్రారంభమవుతుంది. కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రాంత ప్రజలకు ఈ రైలు ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
ట్రైన్ నంబర్ 17207/17208 విజయవాడ-షిర్డీ వెళ్లే రైలును ఇకపై మచిలీపట్నం నుంచి నడుపుతారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, సికింద్రబాద్, వికారాబాద్ మీదుగా సాయినగర్ షిర్డీ చేరుతుంది. దీంతో మచిలీపట్నంతో పాటు గుడివాడ, గుడ్లవల్లేరు, పెడన వాసులకు ప్రయోజనం లభిస్తుంది. ట్రైన్ నంబర్ 17215/17216 ధర్మవరం - విజయవాడ రైలును కూడా మచిలీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తుంది.
ట్రైన్ నంబర్ 17225/17226 కర్ణాటకలో హుబ్లీ నుంచి విజయవాడ వరకు ప్రయాణించే రైలును నరసాపురం వరకు పొడిగించారు. దీంతో గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు నుంచి కూడా హుబ్లీ ప్రయాణాలకు వీలుగా ఉంటుంది.
ట్రైన్ నంబర్ 12861/12862 విజయవాడ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును మహబూబ్‌నగ్ వరకు పొడిగించారు. దీనివల్ల మహబూబ్‌నగర్, షాద్‌నగర్, ఉందానగర్, జడ్చర్ల వాసులకు ప్రయాణాలకు వీలుగా ఉంటుంది.
ట్రైన్ నంబర్ 22701 - 22702 విశాఖపట్నం- విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలును గుంటూరు వరకు పొడిగించారు. ట్రైన్ నంబర్ 17663/17664 తాండూరు-హెచ్‌ఎస్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను కర్ణాటకలోని రాయచూరు వరకు పొడిగించారు.
మహారాష్ట్రలోని హడాప్సర్(పుణే) -హైదరాబాద్ 17013/17014 రైలును కాజీపేట వరకు పొడిగించారు. సికింద్రాబాద్, జనగామ, భువనగిరి స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ట్రైన్ నంబర్ 77401/77402 నంధ్యాల-కడప ప్యాసింజర్ రైలును రేణిగుంట వరకు పొడిగించారు. ఈ రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, కోడూరు, బనగానపల్లి స్టేషన్లలో ఆగుతుంది.
ట్రైన్ నంబర్ 77259/77260 నిజామాబాద్-కరీంనగర్ ప్యాసింజర్ రైలును బోధన్ వరకు పొడిగించారు. జానకం పేట, గాంధీ పార్క్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.