తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Trap : రూ. లక్ష లంచం తీసుకుంటూ.... ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్, క్యాషియర్

ACB Trap : రూ. లక్ష లంచం తీసుకుంటూ.... ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్, క్యాషియర్

HT Telugu Desk HT Telugu

04 July 2024, 19:04 IST

google News
    • ACB Trap in Karimnagar : గత కొద్దిరోజులుగా తెలంగాణ ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా కరీంనగర్ లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డీసీఎంఎస్ మేనేజర్ తో పాటు క్యాషియర్ పట్టుబడ్డారు.
లక్షా రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డిన ఉద్యోగులు
లక్షా రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డిన ఉద్యోగులు (image source ACB Telangana Twitter)

లక్షా రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డిన ఉద్యోగులు

కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) లో అవినీతి తిమింగలాల ఆటపట్టించారు ఏసీబీ అధికారులు. ధాన్యం కొనుగోలు నిర్వాహకుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డీసీఎంఎస్ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్ రావు, క్యాషియర్ కుమారస్వామి ఏసీబీకి చిక్కారు. ఇద్దరిని ఏసీబి అధికారులు అరెస్టు చేసి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే…..

కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో కావటి రాజు ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహించాడు. 2018 నుంచి మొన్నటి యాసంగి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ రూపంలో 90 లక్షల 16 వేల రూపాయలు రావాల్సి ఉంది. 

కమీషన్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎరువులు అంటగట్టారు. కమీషన్ డబ్బుల క్రింద ఎరువులు ఇచ్చి ఒక లారీ లోడ్ ఎరువులకు లక్షరూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయంగా రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వకుండా ఎరువులు అంటగట్టి లోడ్ కు లక్షా రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రాజు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. 

పథకం ప్రకారం కరీంనగర్ డిసిఎంఎస్ కార్యాలయంలో రాజు నుంచి మేనేజర్ వెంకటేశ్వర్ రావు క్యాషియర్ కుమారస్వామి లక్షా రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పి రమణమూర్తి తెలిపారు.

ముప్పు తిప్పల పెట్టాడు-బాదితుడు రాజు

న్యాయంగా తనకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా మేనేజర్ ముప్పు తిప్పల పెట్టాడని బాదితుడు ధాన్యం కొనుగోలు నిర్వాకుడు రాజు తెలిపారు. మూడేళ్లుగా కమిషన్ డబ్బులు రాకపోవడంతో అప్పులపాలై ఇద్దరు బిడ్డలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తన బాధను మేనేజర్ ఏ మాత్రం పట్టించుకోకుండా లంచంగా డబ్బులు ఇస్తేనే కమీషన్ డబ్బులు ముట్టజెప్పుతానని చెప్పారని తెలిపారు. మేనేజర్ తో వేగలేక చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పట్టించానని చెప్పారు. ఇలాంటి అవినీతి లంచగొండి అధికారులు ఎక్కడున్నా పట్టించాలని రాజు కోరారు.

రెండు నెలల్లో మెనేజర్ రిటైర్మెంట్

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు మరో రెండు నెలల్లో రిటైర్మెంట్ కానున్నారు. రిటైర్మెంట్ గడువు దగ్గర పడుతుండడంతో అందిన కాడికి దండుకోవాలని యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. 

వినాశనానికి విపరీత బుద్ధి అన్నట్లు రిటైర్మెంట్ కాబోతున్న మేనేజర్, ధాన్యం కొనుగోలు నిర్వాహకుడికి గత నాలుగేళ్లుగా ఇవ్వాల్సిన కమీషన్ ఇవ్వకుండా ఎరువులు ఇచ్చి అందులో కూడా లంచంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆయన అవినీతికి పరాకాష్టగా మారిందని భావిస్తున్నారు. 

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం