Dubbaka Ganesh Mandapam: దుబ్బాక లో సైబర్ క్రైమ్ గణేశా: సజ్జనార్ మనుసు గెలుచుకున్న నిర్వాహకులు
12 September 2024, 10:18 IST
- Cybercrime Ganesha in Dubbaka: వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటుంటారు భక్తులు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు విగ్రహాలను ఏర్పాటు చేసి వారి భక్తి చూపించడంతో పాటు హుందాతనాన్ని చాటుకుంటారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందరి మన్ననలు పొందింది.
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన వినాయక మండపం
Cybercrime Ganesha in Dubbaka: భక్తి భావంతో పాటు సమాజ హితం ముఖ్యం అంటూ ఆ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక చవితి మండంప అందరిని ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం భిన్నమైన ఆలోచనలతో ప్రజలకు అవగాహన కల్పించడం ఆ యూత్ అలవాటుగా మారింది.
ఈ సారి సైబర్ క్రైమ్ పై అవగహన....
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి రోజున వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
తరచూ సైబర్ మోసాలకు గురవుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కలిపిస్తున్నారు. ఎవరైనా తమ డబ్బులను ఆన్లైన్ లో పోగొట్టుకుంటే, తప్పకుండ వెంటనే 1930 ఫోన్ చేసి పిర్యాదు చేయాలనీ పోస్టర్లు మంటపం చుట్టూ పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు.
గత సంవత్సరం వినాయక చవితి రోజున ఎన్నికల సమయం కావడంతో ఓటు విలువ తెలియజేసేలా యూత్ సభ్యులు వినాయక మండపం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నించారు. ఈ సంవత్సరం అదే తరహాలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజలు, భక్తులు యూత్ సభ్యులను అభినందిస్తున్నారు.
గత 30 సంవత్సరాలుగా వినాయకుడిని పెడుతున్న యువకులు.…
వినాయక మండపానికి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను తెలుసుకొని తిరిగి వెళ్లడం సంతోషంగా ఉందంటున్నారు. ఇలాంటి వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రజల పట్ల అంకితభావం, సమాజం పట్ల బాధ్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. యూత్ సభ్యులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవడం శుభపరిణామని పోలీసులు సైతం శభాష్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సజ్జనార్ మన్ననలు పొందిన వినాయకుడు..
విషయం తెలుసుకున్న, తెలుసుకున్న ఆర్టీసీ ఎండి, వీసీ సజ్జనార్ యువకిరణం అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.భక్తి భావంతో పాటు సమాజం హితం ఎంతో ముఖ్యమని ఈ అసోసియేషన్ గుర్తించడం గొప్ప విషయం.
"సైబర్ నేరాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయి. అమాయకులను మాయమాటలతో మోసగాళ్ళు కోట్లల్లో కుచ్చుటోపి పెడుతున్నారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని సజ్జనార్ పేర్కొన్నారు.