Sangareddy District : కళ్లలో కారం చల్లిన వదిన.. ఆపై సొంత తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న
28 January 2024, 13:21 IST
- Sangareddy district Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుంది. భూమి విషయంలో నెలకొన్న తగాదాలో సొంత తమ్ముడిని హత్య చేశాడు అన్న. అంతేకాదు అడ్డొచ్చిన తండ్రిపైన కూడా గొడ్డలితో దాడి చేయగా… అతను ప్రాణప్రాయస్థితిలో ఉన్నాడు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం
Sangareddy District News : మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి.. చిన్న చిన్న విషయాలకే, అన్న తమ్ములు ఒకరినొకరు కొట్టుకొని తల్లి తండ్రుల కళ్ల ముందే చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి విషాద సంఘటన.. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలో కంబాలపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది.
తండ్రికి చెందిన 14 గుంటల భూమిని ఎవరు సాగు చేసుకోవాలి అనే విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగాదా చోటు చేసుకుంది. ఇందులో తమ్ముడు ప్రాణాలు కోల్పోగా… తండ్రి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కంబాలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి చంద్రయ్య (65) కు కుమ్మరి ఆంజనేయులు (43), కుమ్మరి ప్రభు (46) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకున్న వ్యవసాయ భూమిని, వారిద్దరికి కూడా సమానంగా పంచిచ్చిన తండ్రి, తన కోసం 14 గుంటల భూమి ఉంచుకున్నాడు. అయితే, ఈ భూమిని ఎవరు సాగు చేయాలనే విషయం పైన, సోదరులిద్దరికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి తండ్రులిద్దరూ కూడా… చిన్న కొడుకైనా ఆంజనేయులు వైపు ఉండటంతో ప్రభుకి తల్లి తండ్రులపైనా, తమ్ముని పైన తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. యాసంగి పంటని వేయటానికి… శనివారం మధ్యాహ్నం తన తండ్రికి చెందిన భూమిని దున్నుతున్న ఆంజనేయులిని అన్న ప్రభు అడ్డుకున్నాడు.
ఈ విషయమే ఇంటి దగ్గర భార్యతో, తండ్రితో చెపుతూ, రాత్రి అన్నం తింటున్నాడు ఆంజనేయులు. ఇంతలోనే ప్రభు, తన భార్య, కొడుకుతో కలిసి ఒక గొడ్డలి, కట్టే, కారం తీసుకొని బూతులు తిట్టుకుంటూ ఇంటిలోకి దూసుకువచ్చారు. ప్రభు భార్య ఆంజనేయులు కండ్లలో కారం చల్లగా… ఆంజనేయులు పైన గొడ్డలితో విచక్షణరహితంగా దాడికి దిగాడు భర్త ప్రభు. అడ్డుకోబోయిన తన తండ్రిని కూడా గొడ్డలితో నరికాడు. ప్రభు భార్య, కొడుకు ఇద్దరు కూడా వారిపైన కట్టెలతో దాడి చేసారు. ఈ దాడిలో ఆంజనేయులు రక్తపుమడుగులో అక్కడికక్కడే కుప్పకూలాగా, తీవ్ర గాయాలపాలయిన చంద్రయ్యని స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొని, హుటహుటిన అక్కడికి చేరుకున్న సదాశివపేట పోలీసులు ప్రభు, తన భార్య, కొడుకుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుసింది. ఆంజనేయులు పనిచేస్తేనే తమ కుటుంబానికి పూట గడుస్తుందని, అతను చనిపోవటంతో ఇద్దరు పిల్లలు, భార్య దిక్కులేనివారయ్యారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన గ్రామంలోసంచలనంగా మారింది.