తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections : ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే.. మధ్యలో కామ్రేడ్, సీటు ఎవరికో..?

TS Assembly Elections : ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే.. మధ్యలో కామ్రేడ్, సీటు ఎవరికో..?

29 March 2023, 15:26 IST

google News
  • BRS - CPM Alliance: కారుతో కామ్రేడ్లు కలిశారు... మునుగోడులో విక్టరీ కొట్టారు. తమ దోస్తీ జాతీయ స్థాయిలోనూ ఉంటుందని కేసీఆర్ తో పాటు ఇరు పార్టీల నేతలు కూడా చెప్పుకొచ్చారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... తెలంగాణలోని పలు స్థానాలపై కన్నేశారు కమ్యూనిస్టులు. అయితే కొన్ని సీట్ల విషయంలో తెగ చర్చ నడుస్తూనే ఉంది. అందులోనూ ఓ సీటు తమదంటే తమదే అని పరిస్థితికి వచ్చింది. ఇదీ కాస్త అటు కారు పార్టీలోనూ… ఇటు కామ్రేడ్లలోనూ హాట్ టాపిక్ గా మారింది.

పాలేరు సీటుపై జోరుగా చర్చ...!
పాలేరు సీటుపై జోరుగా చర్చ...!

పాలేరు సీటుపై జోరుగా చర్చ...!

Paleru Assembly Constituency: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్ని కల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి సీపీఐ, సీపీఎం. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్లాలని ఆలోచనలో ఉన్నాయి. కేసీఆర్ సైతం.. ఈ పొత్తు ఇప్పటికీ మాత్రమే కాదు.. భవిష్యత్ లోనూ అని చెప్పారు. మునుగోడులో బీఆర్ఎస్ విజయం సాధించడానికి కమ్యూనిస్టులు కీలకంగా మారారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కూడా ఓ రకంగా ఒప్పుకుంది. 2018 తర్వాత... పూర్తిగా దెబ్బతిన్న కమ్యూనిస్టు పార్టీలు... వచ్చే ఎన్నికల్లో కొన్నిస్థానాలను గెలిచి... మళ్లీ లైన్ లోకి రావాలని భావిస్తున్నాయి. ఓవైపు ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో... పలు సీట్లపై కన్నేశారు కామ్రేడ్లు. అయితే ఖమ్మం జిల్లాలోని పాలేరు సీటుపై తెగ చర్చ నడుస్తోంది. ఏకంగా ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదే అని చెప్పేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే పాలేరు సీటు పంచాయితీ షురూ అయిపోయింది.

అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ... రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే పాలేరు సీటు మాత్రం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్, సీపీఎం పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ఈ సీటు తమకే కేటాయించాలని... తామే పోటీ చేస్తామంటూ తమ్మినేని వీరభద్రం కుసుమంచిలో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏకంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలోనే అనేశారు. ఇదీ కాస్త ఇరు పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది.

కొద్దిరోజుల కిందట పాలేరులో జన చైతన్య యాత్ర చేపట్టింది సీపీయం. ఇందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన తమ్మినేని... పాలేరు సీటును తమకు కేటాయించాలని... ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే తమ్మినేని కామెంట్స్ తో పాలేరు సీటు సీపీయంకు వెళ్తుందా అన్న చర్చ జోరుగా జరిగింది.

తమ్మినేని కామెంట్స్ పై చర్చ జరుగుతున్న వేళ... కొద్దిరోజులకే ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు సీటు తనకు తప్ప ఎవరికీ రాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీటు తనకే వస్తుందని.. తానే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. సీపీఎం పోటీ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని... కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయంటూ కాస్త గట్టిగానే మాట్లాడారు. అయితే ఈ సీటు నుంచే పోటీ చేయాలని బీఆర్ఎస్ కు చెందిన నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన... మరోసారి తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల... బీఆర్ఎస్ లోకి రావటంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సొంత పార్టీ నేతల మధ్య టికెట్ పంచాయితీ నడుస్తున్న వేళ... కొత్తగా సీపీయం సీనియర్ నేత తమ్మినేని కూడా ఇక్కడ్నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే పాలేరు సీటును తమకు కేటాయించాలని కోరుతున్నారు.

ఇక ఇదే సీటు నుంచి వైఎస్ షర్మిల కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. మరోవైపు పొంగులేటి కూడా పోటీపై ఫోకస్ పెట్టారనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలకు ముందే పాలేరు రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే టికెట్ పై బోలేడు ఆశలు పెట్టుకోగా... తమ్మినేని ఎంట్రీతో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి వ్యాసం