తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapalli Rdo Office: పెద్దపల్లి ఆర్డీఓ ఆఫీస్ జప్తుకు కోర్టు ఆదేశం, రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం

Peddapalli RDO Office: పెద్దపల్లి ఆర్డీఓ ఆఫీస్ జప్తుకు కోర్టు ఆదేశం, రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం

Sarath chandra.B HT Telugu

15 August 2024, 5:53 IST

google News
    • Peddapalli RDO Office: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం జప్తుకు కోర్టు ఆదేశించింది. రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆర్డీఓ కార్యాలయ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. 
పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం జప్తుకు కోర్టు ఉత్తర్వులు
పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం జప్తుకు కోర్టు ఉత్తర్వులు

పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం జప్తుకు కోర్టు ఉత్తర్వులు

Peddapalli RDO Office: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం జప్తుకు కోర్టు ఆదేశించింది. రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆర్డీఓ కార్యాలయ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశంతో జప్తు కోసం రైతులు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళగా ఈనెల 19 లోగా పరిహారం డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్ హామీతో రైతులు కాస్త వెనక్కి తగ్గారు.

పాతికేళ్ళుగా పోరాటం..

రామగుండం థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్టీపిసీఎల్) కోసం 1997లో అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి కి చెందిన 300 మంది రైతులకు చెందిన 750 ఎకరాలు సేకరించారు. అప్పట్లో ఎకరాన 18 నుంచి 22 వేల చొప్పున చెల్లించారు. అయితే ఆర్టిపిసిఎల్ కోసం తీసుకున్న భూములు బిపిఎల్ కు అప్పగించడం జరిగింది.‌

పనులు జరగపోగా భూములు పడావుపడి సరైన పరిహారం రాక రైతులు న్యాయ పోరాటం మొదలు పెట్టారు. 2014లో ఎకరాన 90 వేల చొప్పున చెల్లించాలని పెద్దపల్లి కోర్టు తీర్పునిచ్చింది.‌ ఆ డబ్బులు కూడా చెల్లించకపోవడంతో 2023లో 36 మంది రైతుల హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు రైతుల విజ్ఞప్తిని మన్నించి గత డిసెంబర్ 15 లోగా డబ్బులు డిపాజిట్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది.‌ హైకోర్టు ఆర్డర్ ను అధికారులు బేఖాతరు చేయడంతో మరోసారి రైతులు గోదావరిఖని సెషన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో గోదావరి సెషన్స్ కోర్టు ఈనెల 20వ తారీకులోగా‌ పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయ ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ఆర్డర్ ను ఆర్డీఓకు రైతులు అప్పగించారు.

2.12 కోట్లు చెల్లించాలి..

పరిహారం కోసం రైతులు 27 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. 36 మంది రైతులకు రెండు కోట్ల 12 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 20వ తారీకు లోపు రైతులకు చెల్లించకుంటే కోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయం ఆస్థులు జప్తు చేయడం జరుగుతుందని రైతులు తెలిపారు. రైతుల ఆవేదనను విన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈనెల 19 లోగా పరిహారం డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుతిరిగారు.

రామగుండం ధర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 300 మంది రైతులు భూములు ఇస్తే కంపెనీతో సంబంధం లేకుండా వేరే వాళ్ళకు భూములు అప్పగించి రైతుల ఇబ్బందుల గురిచేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.‌ భూములు ఇచ్చిన 300 మంది రైతుల్లో ఇప్పటికే 120 మంది చనిపోయారని ఇప్పటికైనా తమ గోడును పట్టించుకుని తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాదిత రైతులు కోరారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం