Konda Surekha Vs KTR: కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం, ఆ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశం..
25 October 2024, 14:28 IST
- Konda Surekha Vs KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ‌్యలపై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది.
కొండా సురేఖ తీరును తప్పు పట్టిన సిటీ సివిల్ కోర్టు
Konda Surekha Vs KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్ప వ్యాఖ్యలపై దాఖలైన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖ తీరును కోర్టు తప్పు పట్టింది.
కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఎప్పుడూ కేటీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది.
కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తీరును సిటీ సివిల్ కోర్టు తప్పు పట్టింది. . ఇంకెప్పుడూ కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్ విచారణ సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని హితవు పలికింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు పేర్కొంది.
కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది. భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది.
కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది.
దేశంలో ఇదే మొదటి సారి
పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. ఆయనప్పటికీ మంత్రి కొండా సురేఖ లో ఎలాంటి మార్పు రాలేదు.
తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలను సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక పై తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.