Armur BRS: ఆర్మూరులో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు
14 December 2023, 11:17 IST
- Armur BRS: ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వరుస కష్టాలు తప్పడం లేదు. తాజాగా ఆర్మూరు మునిసిపల్ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా 26మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి రెడీ అయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (ఫైల్ ఫొటో)
Armur BRS:`జీవన్ మాల్` అక్రమాలతో రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి పట్టణంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే జీవన్‌మాల్‌కు ఆర్టీసీ అధికారులు, విద్యుత్ అధికారులు నోటీసులు ఇవ్వగా... రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా రుణం చెల్లించాలని ఆదేశించింది. ఇక జీవన్‌రెడ్డి ఆయన సోదరుడి పేరుపై ఉన్న క్వారీలో జరిగిన అక్రమాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు.
వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుండగా.. మరోవైపు పార్టీలో ముసలం స్టార్ట్ అయ్యింది. ఆర్మూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు రెఢీ అయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
కౌన్సిలర్లు వర్సెస్ చైర్‌పర్సన్ ఫ్యామిలీ
ఆర్మూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ గా బీఆర్ఎస్‌కు చెందిన పండిత్ వినీత పదవిలో కొనసాగుతున్నారు. అయితే పదవిలో ఆమె కొనసాగుతున్నప్పటికీ.. పనులన్నీ ఆమె భర్త, మరిది చక్కబెట్టడం షరామాములుగా సాగుతోంది. గతంలో ఏకంగా మున్సిపల్ కమిషనర్లకు, ఛైర్ పర్సన్ భర్తకు పలుమార్లు వివాదాలు జరిగాయి.
కమిషన్ల విషయంలో ఏకంగా కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగిన ఘటనలు మాయని మచ్చగా మిగిలాయి. ఈ విషయంలో గతంలోనే ఆర్మూరు ఎమ్మెల్యేగా ఉన్న జీవన్‌రెడ్డికి కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. అవిశ్వాసం పెడతామని చెప్పారు. కానీ జీవన్‌రెడ్డి అందుకు ఒప్పుకోలేదు.
అవిశ్వాసం పెడితే చైర్‌పర్సన్ పదవికోసం పెట్టిన ఖర్చుతో పాటు తమ అవినీతి బయటకు వస్తుందని ఒప్పుకోలేదన్నది అప్పటి టాక్. గత నాలుగేళ్లుగా పూర్తిగా షాడో చైర్మన్ కనుసన్నల్లోనే పనులు జరిగాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా అవినీతి, అక్రమాలను కౌన్సిలర్లు బయట పెట్టినప్పటికీ ఇటు జిల్లా యంత్రాంగం, అటు ఎమ్మెల్యే చర్యలకు వెనుకాడారు.
డబ్బుల కోసం ఖాళీ స్థలాలకు ఇంట నెంబర్లు ఇవ్వడం, ట్రాక్టర్లు, ఆటోల కొనుగోళ్లలో డబ్బులు వెనకేసుకోవడం, పదే పదే కార్యాలయానికి మరమ్మతుల పేర డబ్బులు మింగడం పరిపాటిగా మారింది. ఇప్పటికే వ్యక్తిగత అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జీవన్‌రెడ్డికి అవిశ్వాసం మరో తలనొప్పిగా మారింది. ఒకవేళ అవిశ్వాసం ఆమోదం పొంది పదవి కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరిగి పార్టీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం లేకపోలేదు.
(రిపోర్టింగ్ మీసా భాస్కర్, నిజామాబాద్)