Congress Nalgonda List : ఆరు చోట్ల ఓకే.. మరో ఆరు చోట్ల పెండింగ్ - కారణాలివేనా..?
15 October 2023, 13:27 IST
- Telangana Congress Candidates Nalgonda: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో…. 55 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లకుగానూ ఆరు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది.
నల్గొండ జిల్లా అభ్యర్థులు - కాంగ్రెస్
Telangana Congress Candidates Nalgonda: సుదీర్ఘ నిరీక్షణల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ శాసన సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలను గాను ఆరు నియోజకవర్గాల్లో తమ గెలుపు గుర్రాలను ప్రకటించింది. కాగా, మిగిలి ఆరు చోట్ల వివిధ కారణాల రీతాయ ఇంకా కసరత్తు చేస్తోందని, రెండో జాబితాలో ఈ ఆరు నియోజకవర్గాలకు స్థానం ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆరు చోట్ల ఓకే.. ఆరు చోట్ల పెండింగ్
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ముందు నుంచీ ఊహించినట్టుగానే.. ఎలాంటి వివాదం లేని ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య యాదవ్, నల్లగొండ నుంచి భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జున సాగర్ నుంచి సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి రెండో తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి, హుజూర్ నగర్, కోదాడల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలకు టికెట్లు ఖరారు చేసింది. ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని నకిరేకల్ అభ్యర్థిగా ప్రకటించింది. జిల్లాలో ఇంకా.. భువనగిరి, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడెం, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఆరు స్థానాల్లో పోటీ దారులు ఉండడం, ఇతర రాజకీయ కారణాలు ఉండడంతో తొలి జాబితాలో చోటు దక్కలేదంటున్నారు.
ఆరు చోట్ల పెండింగ్ కు కారణాలు ఇవే
భువనగిరి : ఈ స్థానం నుంచి తొలి జాబితాలోనే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేరు ఉంటుందని అంతా భావించారు. భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన ఆయన, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పొసగక కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. కానీ అక్కడ కుదురుకోలేక పోయారు. కాంగ్రెస్ పెద్దల జోక్యంతో తిరిగి కాంగ్రెస్ లోకి వెనక్కి తిరిగి వచ్చారు. ఈ మధ్యలో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి పార్టీకి రావడంతో జిట్టాను పక్కన పెట్టారన్న వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదరాల్సి ఉన్న కారణంగానే పెండింగ్ లో పెట్టారని చెబుతున్నారు.
మునుగోడు: 2018 ఎన్నికల్లో మునుగోడు స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సీటును కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఒక వైపు వామపక్షాలు పొత్తుల భాగంగా ఈ సీటును కోరగా, ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పాల్వాయి స్రవంతి, చలమల్ల క్రిష్ణారెడ్డి, బీసీ కోటాలో పున్న కైలాస్ నేత టికెట్లు ఆశిస్తున్నారు. ఈ పంచాయితీ తీరకపోవడంతోనే పెండింగ్ లో పెట్టారు.
దేవరకొండ: ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన దేవరకొండలోనూ కాంగ్రెస్ టికెట్ కు పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ ఛైర్మన్ బాలూ నాయక్, మరో నేత కిషన్ నాయక్ మధ్య టికెట్ పోటీ ఉంది. బాలూనాయక్ జెడ్పీ చైర్మన్ గా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ కు వెళ్లి తిరిగి వచ్చినా. 2018 లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి టికెట్ ఆశిస్తున్నా.. ఇతర నాయకులూ పోటీ పడడంతో పెండింగులో ఉంచారు.
మిర్యాలగూడెం : 2014 ఎన్నికల్లో ఈ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ, నాటి ఎమ్మెల్యే భాస్కర్ రావు బీఆర్ఎస్ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ ఇక్కడ బీసీ నాయకుడు ఆర్.క్రిష్ణయ్యను పోటీకి పెట్టినా ఓటమి పాలైంది. ఇపుడు పొత్తులో భాగంగా ఈ సీటును సీపీఎం కోరుతోంది. మరో వైపు కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, జానారెడ్డి పెద్ద తనయుడు రఘువీర్ రెడ్డి ఇంకా కొందరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సీపీఎం, కాంగ్రెస్ ల పొత్తు వ్యవహారం తేలేవరకు పెండింగులోనే ఉంటుందని చెబుతున్నారు.
సూర్యాపేట : ఈ నియోజకవర్గం నుంచి వరసగా బీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల వ్యత్యాసంతోనే కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.దామోదర్ రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన టికెట్ ఆశిస్తుండగా.. మరో నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దర మధ్య ఏకాభిప్రాయం కుదర్చి ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది. ఈ కారణంగానే ఇక్కడ అభ్యర్థి పేరు ప్రకటనను పెండింగులో పెట్టారు.
తుంగతుర్తి : ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తిలో కాంగ్రెస్ వరసగా ఓటమి పాలవుతోంది. గత రెండు 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ ఓడిపోయారు. మూడో సారి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పిడమర్తి రవి, మరో నాయకుడు డాక్టర్ రవి వంటి వారు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరిని ఫైనల్ చేయాల్సి ఉన్నా.. ఇంకా కసరత్తు పూర్తికాని కారణంగానే పెండింగులో పెట్టినట్లు సమాచారం.
మొత్తంగా ఆరు నియోజకవర్గాలకు గెలుపు గుర్రాలను ప్రకటించినా.. ఇంకా ఆరు పెండింగులో ఉండడంతో వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండు సీట్ల విషయంలో వామపక్షాల పొత్తు వ్యవహారంతో ముడిపడి ఉండడం కూడా పెండింగ్ కు కారణంగా చెబుతున్నారు.