BRS KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు... మా టైం వస్తుంది, అందర్నీ గుర్తు పెట్టుకుంటామన్న కేటీఆర్
27 September 2024, 7:27 IST
- BRS KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు... మా టైం వస్తుంది... ఇప్పుడు ఎవరెవరు అతిగా వ్యవహరిస్తున్నారో వారిని గుర్తుంచుకుంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ హెచ్చరించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ మేము అధికారంలోకి వస్తామని అప్పుడు ఎవరిని వదిలిపెట్టమన్నారు.
కాంగ్రెస్ మాటలు నమ్మి అధికారులు ఆగం కావొద్దంటున్న కేటీఆర్
BRS KTR: తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా బాకీ తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటిఆర్, పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్‌ది మూర్ఖపు ప్రభుత్వమని.. సరైన అవగాహన లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎంకు తెలువదని...చెప్తే వినడని.. తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. సీఎం చెబుతున్న ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటి రియల్ ఎస్టేట్స్ స్కామ్ అని ఆరోపించారు.
ఉన్న సిటి గురించి మాట్లాడడం లేదన్నారు. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీకి ఒక్క ఎకరం భూమి అయినా సేకరించావా అని ప్రశ్నించారు. గతంలో నీవు చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీకి బిఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూములను రైతులకు ఇచ్చేస్తామన్నారు.. ఇప్పుడు ఇచ్చేస్తావా అని ప్రశ్నించారు.
ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలు కండిషనల్ ల్యాండ్ అక్వేషన్ చేశామని కేటిఆర్ తెలిపారు. ఫార్మా సిటీ ఉంటే అందుకే ఆ భూమిని వినియోగించాలని, ఫార్మా సిటీని రద్దు చేస్తే ఆ భూమిని రైతులకే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో పార్టీలో కులంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుని రైతులను కలుస్తామన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో కాంగ్రెస్ భూ దందాలను బయటపెడతామని తెలిపారు. న్యాయమూర్తులు గమనించాలని కోరారు.
హైడ్రా బాధితులకు అండగా ఉంటాం…
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ళు కూల్చి హైడ్రామా చేస్తుందని కేటిఆర్ ఆరోపించారు. బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ పరిధిలో పేదలూ ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ నీతిని అమలు చేస్తుందని విమర్శించారు.
ఓవైపు రిజిస్ట్రేషన్లు చేస్తూనే మరోవైపు హైడ్రా పేరుతో కూల్చివేతలు కొనసాగిస్తుందని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం బడా నేతలు, సీఎం సోదరుని ఇల్లును ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బఫర్ జోన్ ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ళను కూల్చే ముందు బీఆర్ఎస్ హాయాంలో నగరంలో నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పేదలకు ఇచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలని కోరారు. లేకుంటే బాధితుల పక్షాన బిఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
నాపై కోపం ఉంటే...కార్మికులపై చూపద్దు…
నాపై కోపం ఉంటే సిరిసిల్ల నేత కార్మికులపై పగ తీర్చుకోవడం సరైన పద్దతి కాదన్నారు కేటిఆర్. బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేసి నేత కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గడిచిన ఆరు మాసాల్లో 12 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మారిన నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టి నేత కార్మికులకు ఉపాధి చూపిందన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కారణం చేత సిరిసిల్ల నేత కార్మికులను గోసపుచ్చుకుంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ఇటీవల ఆడబిడ్డలకు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తామన్నారని, ఆ ఆర్డర్ సిరిసిల్ల కార్మికులకే ఇవ్వాలని కోరారు.
అధికారులు కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగంకాకండి…
కాంగ్రెస్ సన్నాసుల మాటలు నమ్మి అధికారులు ఆగమాగం కావద్దన్నారు కేటిఆర్. సిరిసిల్లలో రేషన్ డీలర్ల ఎంపికకు నిర్వహించిన రాత పరీక్ష మెరిట్ లిస్టును ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకుల ఫైరవీలతో రేషన్ డీలర్లను ఎంపిక చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. సిరిసిల్ల జిల్లాను పుట్టించిందే కేసీఆర్.. మళ్ళీ నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం.. అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎల్లకాలం కాంగ్రెస్ కాలం కాదు.. తప్పకుండా మా టైం వస్తుందని తెలిపారు. ఎవరెవరైతే అతిగా చేస్తున్నారో గుర్తుపెట్టుకుని మిత్తితో సహా చెల్లిస్తామని అధికాలను హెచ్చరించారు.
మానేర్ లో మూడు ఇళ్ళు కోల్పోయాం…
నిర్వాసితుల బాధ, గోస తనకు తెలుసని, మానేరు ప్రాజెక్టుల్లో మూడు ఇళ్లు కోల్పోయామని కేటీఆర్ తెలిపారు. అమ్మమ్మ ఊరు బోయినపల్లి మండలం కొదురుపాకలో అమ్మమ్మ తాతయ్య జోగినపల్లి లక్ష్మీబాయి కేశవరావు జ్ణాపకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(కాంగ్రెస్) తో కలిసి కేటిఆర్ ప్రారంభించారు.
బడి కట్టించాం... రాజకీయాలకు అతీతంగా గుడి పూర్తిచేసి గ్రామానికి అంకితం చేస్తామన్నారు. కొదురుపాక కు వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. మిడ్ మానేర్ లో కొదురుపాక మునిగిపోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వ్యక్తిని నీనేనని తెలిపారు. ఎగువ మానేర్ లో నాయనమ్మ ఇల్లు, మిడ్ మానేర్ అమ్మమ్మ ఇల్లు, లోయర్ మానేర్ లో ఇంకో అమ్మమ్మ ఇల్లు కోల్పోయామని చెప్పారు. మూడు మానేర్ ప్రాజెక్టులో మూడు ఇళ్ళను కోల్పోయామని, నిర్వాసితుల బాధలు తనకు బాగా తెలుసన్నారు. మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వంలో తాము లేకపోయినా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)