తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityala Bus Journey: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ...జగిత్యాల పల్లెవెలుగు బస్సులో 150 మంది ప్రయాణం

Jagityala Bus Journey: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ...జగిత్యాల పల్లెవెలుగు బస్సులో 150 మంది ప్రయాణం

HT Telugu Desk HT Telugu

03 October 2024, 9:37 IST

google News
    • Jagityala Bus Journey: బతుకమ్మ , దసరా పండుగల సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. ప్రయాణికులతో బస్సులన్ని కిటకిటలాడుతున్నాయి. గ్రామాలకు  వెళ్లే బస్సులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి.జగిత్యాల జిల్లాలో పల్లె వెలుగు బస్సులో 150 మంది ప్రయాణించడం బస్సుల కొరతకు, రద్దీకి అద్దం పడుతుంది.
జగిత్యాలలో కిక్కిరిసిపోయిన పల్లె వెలుగు బస్సులు
జగిత్యాలలో కిక్కిరిసిపోయిన పల్లె వెలుగు బస్సులు

జగిత్యాలలో కిక్కిరిసిపోయిన పల్లె వెలుగు బస్సులు

Jagityala Bus Journey: జగిత్యాలలో పల్లె వెలుగు బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. ఖాళీ లేనంతగా ప్రయాణికులతో నిండిపోయి శ్వాస ఆడ లేని పరిస్థితుల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు నడుస్తుండడంతో ఇద్దరు సొమ్మసిల్లి పడిపోయారు.

పండగ సెలవులు.. ఆర్టీసి మహిళలకు ఫ్రీ ప్రయాణ సౌకర్యంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో విద్యాసంస్థలకు సెలవులు రావడంతో పిల్లలతో పెద్దలు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. బస్ స్టేషన్ లు, ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారాయి.‌

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే పల్లె వెలుగు బస్సుల్లో ప్రమాదకరస్థాయిలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి ఓవర్ లోడ్ తో బస్సులు తిరిగే పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల నుంచి దావన్ పల్లికి వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో 150 మంది ప్రయాణికులు ఎక్కారు. జగిత్యాల నుంచి ఆలూరు, రంగపేట, వీరాపూర్ మీదుగా ధావన్ పల్లికి ఒకే ఒక బస్సు ఉండడంతో పండుగ పూట ప్రయాణీకులతో బస్సు కిక్కిరిసిపోయింది.

సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు మహిళలు

ప్రయాణీకుల రద్దీతో బస్సు ప్రమాద స్థాయికి చేరింది. కిక్కిరిసిన ప్రయాణీకులతో ప్రమాదస్థాయిలో బస్సు బయలుదేరడంతో శ్వాస ఆడక ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. మహిళా ప్రయాణికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు వేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు ప్రయాణంతో ప్రతినిత్యం ఇదే పరిస్థితి ఉంటుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పండగ పూట ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ హైదరాబాద్ రూట్ లో ప్రత్యేక బస్సులు

బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రధాన రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 11 వతేదీ వరకు జేబీఎస్ నుంచి కరీంనగర్ కు 810 బస్సులు, అక్టోబర్ 12 నుంచి 21 వరకు కరీంనగర్ నుండి జేబీఎస్ కు 850 బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించారు.

ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. పట్నం నుంచి జిల్లా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు వెయ్యడం బాగానే ఉంది కానీ, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు ఎందుకు వేయడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కరీంనగర్ రూట్ లో 800కు పైగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల మాదిరిగానే గ్రామీణ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం