Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాలు, ఏడుగురి అరెస్టు.. 13 పందెం కోళ్ళు, 60 కత్తులు స్వాధీనం
02 December 2024, 13:10 IST
- Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 పందెం కోళ్ళు, 60 కత్తులు, ఐదు మొబైల్స్ 6530/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో కోడి పందాల నిర్వహణపై పోలీసుల దాడి
Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాలు కలకలం సృష్టిస్తున్నాయి. సంక్రాంతి పండుగకు ఆంధ్రాలో ఎక్కువగా జరిగే కోడి పందాలు.. సంక్రాంతికి 50 రోజుల ముందే పెద్దపల్లి జిల్లాలో కోడి పందాలు మొదలు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. కోడి పందాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి కొరడా ఝుళిపించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మండలం కాపులపల్లిలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పందెంరాయుళ్ళు డబ్బులు పెట్టి పందెం కాస్తూ జోరుగా దందా నడిపిస్తున్నారనే సమాచారంతో కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి నిర్వహించారు. ఏడుగురు పట్టుబడ్డారు. వారి నుంచి 13 పందెం కోళ్ళు, 60 కత్తులు, ఐదు మొబైల్స్, రూ. 6530/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిలో..
రాగినేడుకు చెందిన తాళ్ల రాములు, యాదగిరి అనిల్, పాలకుర్తికి చెందిన రావుల మధునయ్య, కొత్తపల్లికి చెందిన B. వెంకటేష్, బ్రాహ్మణపల్లికి చెందిన మూల మహేందర్, పెద్దపల్లి చెందిన బుడగడ్డ నర్సయ్య, సుల్తానాబాద్ కు చెందిన మైదంపల్లి రవితేజ ఉన్నారు. మరికొందరు పారీపోయినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రమేష్ బాబు తెలిపారు. జూదంలా మారిన కోడిపందాలు నిషేధితమని, ఎక్కడైనా ఆడితే పోలీసులకు సమాచార ఇవ్వాలని కోరారు.
ఇద్దరు దొంగలు అరెస్టు...
పొద్దంతా లారీలను నడుపుతూ రాత్రి కాగానే ప్రధాన రోడ్ల వద్ద ఉన్న ఏటీఎంల్లో చోరీలకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లను ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ రహదారి టీటీఎస్ ఎదురుగా ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీంఎలో గత నెల 26న చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీమ్ విచారణ చేపట్టగా ఏపిలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన తుమ్మల మధు, బండ్ల అబ్రహంలు పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి నేరం చేయడానికి ఉపయోగించిన లారీ, ఇనుప సుత్తి, జర్కిన్స్, మంకీ క్యాపులు, మాస్కులు, బ్లౌజులు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)