తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Profits: లాభాల బాటలోకి సింగరేణి, రోజూ 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం

Singareni Profits: లాభాల బాటలోకి సింగరేణి, రోజూ 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం

HT Telugu Desk HT Telugu

04 October 2023, 8:30 IST

google News
    • Singareni Profits: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో  మిగిలిన ఆరు నెలల కాలంలో రోజుకు కనీసం 2.10 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్పత్తి ,రవాణాతో మార్చి  చివరికి 720 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని దాటాలని సింగరేణి ఛైర్మ‌న్‌ ఎన్. శ్రీధర్ పిలుపునిచ్చారు.
లాభాల బాటలో సింగరేణి
లాభాల బాటలో సింగరేణి

లాభాల బాటలో సింగరేణి

Singareni Profits: సింగరేణిలో మార్చినాటికి 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా ముందుకు పోవాలని సిఎండి కార్మికులకు పిలుపునిచ్చారు. లక్ష్యాలు సాధిస్తే ఈ ఏడాది 40 వేల కోట్ల టర్నోవర్‌తో పాటు , రూ.3500 కోట్ల లాభాలు సాధ్యమన్నారు.

దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతుందని, కనుక ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన ఆరు నెలల కాలంలో రోజుకు కనీసం 2.10 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్పత్తి , రవాణా జరపాలని, మార్చి చివరికల్లా 720 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని దాటాలని సింగరేణి సంస్థ ఛైర్మ‌న్‌ మరియు ఎండీ ఎన్. శ్రీధర్ పిలుపునిచ్చారు.

సింగరేణి భవన్ నుండి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు,సంస్థ డైరెక్టర్లతో సింగరేణిలో జరగాల్సిన ఉత్పత్తి పై వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

సింగరేణిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరునెలల కాలంలో వర్షాల వల్ల కొంత ఇబ్బంది ఉన్నా, అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ గత ఏడాదితో పోలిస్తే బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధిని, బొగ్గు ఉత్పత్తిలో 7 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో దాదాపు 15 శాతం వృద్ధిని సాధించటం పై సంస్థ ఛైర్మన్ ఎండి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న ఆరు నెలల కాలం ఎంతో కీలకమైందని, దేశంలో బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ వస్తోందని, అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలు అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చినట్లు చెప్పారు.

ఇకపై వర్ష ప్రభావం కూడా సింగరేణి పై ఉండే అవకాశం లేదని కనుక రానున్న వారం రోజుల్లోగా ఓపెన్ కాస్ట్ క్వారీలలో ఇంకా నిలిచి ఉన్న నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తిని, ఓవర్ బర్డెన్ తొలగింపును ఇచ్చిన లక్ష్యాల మేర విధిగా సాధించాలని , దీనికోసం ఏరియా స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు పోవాలని జీఎం లను ఆదేశించారు.

దసరా, దీపావళికి బోనస్‌లు..

సింగరేణి రీజియన్స్ తమకు ఇచ్చిన లక్ష్యాలు సాధిస్తే ఈ ఏడాది నిర్దేశిత 720 ల‌క్ష‌ల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి ,రవాణా చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు 3500 కోట్ల రూపాయల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు.

సింగరేణి ఉద్యోగులకు గతం లో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫా రూ 1750 కోట్ల రూపాయల వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లించామని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 32 శాతం లాభాల బోనస్ మొత్తం రూ .711 కోట్ల రూపాయలను కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామనీ ప్రకటించారు.

దీపావళి బోనస్ ను కూడా ఆ పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కంపెనీపై విశ్వాసంతో, విధుల పట్ల అంకితభావంతో కార్మికులు, అధికార శ్రేణులు స‌మ‌ష్టిగా కృషి చేయాలని, తద్వారా గత ఏడాది కన్నా మిన్నగా లాభాలు పొందే అవకాశం ఉందన్నారు.

తొలి అర్థ సంవత్సరంలో లక్ష్యాలను దాటిన సింగరేణి

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ మాసాంతానికి గల అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలో నిర్దేశిత లక్ష్యాలను సాధించింది.

ఈ అర్థ సంవత్సరానికి బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా సింగరేణి ఈ లక్ష్యాన్ని దాటి 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి సాధించిన బొగ్గు రవాణా (294 లక్షల టన్నులు)తో పోల్చి చూస్తే ఇది 12 శాతం అధికమని.. అలాగే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సర బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 314 లక్షల టన్నులను సాధించి నూరు శాతం లక్ష్యసాధన తో నిలిచిందని ఆనందం వ్యక్తం చేసారు.

గత ఏడాది ఇదే కాలానికి సాధించిన బొగ్గు ఉత్పత్తి (292 లక్షల టన్నులు)తో పోల్చి చూస్తే 7.15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హమన్నారు. ఓవర్ బర్డెన్ తొలగింపులో గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన 171.30 లక్షల క్యూబిక్ మీటర్ల కన్న మిన్నగా ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 14.84 శాతం వృద్ధితో 196.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను సింగరేణి సంస్థ సాధించిందని వివరించారు.

రిపోర్టర్ గోపికృష్ణ,కరీంనగర్

తదుపరి వ్యాసం