Shepherd girl to IIT: గిరిజన బిడ్డకు సీఎం చేయుత, ఐఐటిలో చేరేందుకు మధులతకు తొలగిన అడ్డంకి
25 July 2024, 6:17 IST
- Shepherd girl to IIT: చదువు కొనే స్తోమత లేక మేకలకాపరిగా మారిన గిరిజన బాలికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. ఐఐటీలో చేరేందుకు అండగా నిలిచారు.
గిరిజన బాలికకు నగదు చెక్కు అందిస్తున్న అధికారులు
Shepherd girl to IIT: గిరిజన బాలిక ఉన్నత విద్యాభ్యాసానికి డబ్బు ఆటంకంగా మారింది. ఐఐటీలో సీటు సాధించినా డబ్బుల్లేక మేకల కాపరిగా మారింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలికను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దీంతో ఆమె పాట్నా ఐఐటి లో సీటు సాధించింది.
సరస్వతి కరుణించినా లక్ష్మీ కటాక్షం లేక.. చదువు కొనలేని పరిస్థితుల్లో మేకల కాపరిగా మారింది. గిరిజన బిడ్డ దీనస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గిరిజన బిడ్డ కు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకుని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించి పాట్నా ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే రూ.3లక్షల ఫీజు ఈనెల 27న చెల్లించి జాయిన్ కావాల్సి ఉండగా నిరుపేద కుటుంబం కావడంతో ఫీజు చెల్లించలేని స్థితిలో చదువు కొనలేక మేకలకాపరిగా మారింది.
మీడియా లో వైరల్... స్పందించిన సీఎం..
ఐఐటి లో సీటు సాధించినా పేదరికంతో చదువు కొనలేక మేకల కాపరిగా మారిందనే విషయం మీడియాలో వైరల్ గా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గిరిజన పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి, వారి కుటుంబాన్ని హైదరాబాద్ కు పిలిపించారు. స
చివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు రూ:1,51,831 చెక్కును అందజేశారు. విద్యార్థిని కోరిక మేరకు హై ఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ.70వేలకు అదనంగా మరో రూ.30వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మురిసిన మదులత...
ఆర్థిక ఇబ్బందులతో ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందిన మధులత స్వయంగా సీఎం ద్వారా ఆర్థిక సహాయం పొందడంతో ఆనందం వ్యక్తం చేసింది. తన దీన స్థితిని తెలుసుకుని మానవత్వంతో స్పందించి సీఎం చదువుకు చేయుత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని మధులత. సీఎం కు ధన్యవాదాలు తెలిపి ప్రభుత్వ సహాయాన్ని మర్చిపోకుండా ఉన్నత విద్యను చదివి ప్రయోజకురాలునై తనలాంటి పేద విద్యార్థులకు అండగా నిలుస్తానని తెలిపారు.
షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్) ఛైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, గిరిజన శాఖ అధికారులు విద్యార్థినిని అభినందించి చదువుకు ఆర్థిక ఇబ్బంది అడ్డురాకుండా సహాయం చేస్తామని ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)