BRS Manifesto 2023 : మేనిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయి? కేసీఆర్ సంచలన హామీలు ఇవ్వబోతున్నారా..?
08 October 2023, 5:45 IST
- TS Assembly Elections : బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు... లీకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓరుగల్లు వేదికగా ప్రకటించే మేనిఫెస్టోలో రైతులతో పాటు పెన్షన్ దారులకు పెద్దపీట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆసక్తిని రేపుతున్న బీఆర్ఎస్ మేనిఫెస్టో
Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోంది. కీలక నేతలు నియోజకవర్గాల్లో వరుస పర్యటనలతో... కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే...మేనిఫెస్టోపై లీకులు ఇస్తున్నారు. ఓరుగల్లు వేదికగా మేనిఫెస్టో ప్రకటిస్తామని... ఆ తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయమంటూ అందరిలోనూ ఉత్కంఠను రేపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలకమైన హామీలను ప్రకటించిన నేపథ్యంలో.... బీఆర్ఎస్ మరో లెవల్ లో మేనిఫెస్టోను కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగానూ మారింది.
ఆసక్తిని పుట్టించేలా ప్రకటనలు...!
ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టోను కేసీఆర్ రెడీ చేస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు పదే పదే చెబుతున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని... మీరు కోరుకునే విధంగానే మేనిఫెస్టోలో పలు ప్రకటనలు ఉంటాయని, శుభవార్తలు వినేందుకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్... హన్మకొండ సభ వేదికగా కీలకమైన లీకు ఇచ్చేశారు. పెన్షన్లను పెంచుకుంద్దామని.... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారంటూ చెప్పకనే చెప్పేశారు. పార్టీలో కీలక నేతలుగా, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న హరీశ్ రావు, కేటీఆర్ లు చేస్తున్న ప్రకటనలు... అందరిలోనూ ఉత్కంఠను రేపుతున్నాయి. పెన్షన్ల పెంపే కాకుండా...ఏ అంశాలపై కేసీఆర్ ప్రకటన చేస్తారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ మేనిఫెస్టోపై పక్కాగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. మేథో వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ.... ఏం ఉండాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల మేరకు సమాచారం. ఇప్పటికే రైతుబంధు, బీమా వంటి పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్.... ఓరుగల్లు వేదికగా అక్టోబరు 16వ తేదీన ఎలాంటి ప్రకటన చేస్తారు..? సంచలన పథకాలు ఉంటాయా...? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. కేవలం బీఆర్ఎస్ లోనే కాదు... ప్రతిపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కన్నేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలతో జనాల్లోకి వెళ్తున్నప్పటికీ... బీఆర్ఎస్ మేనిఫెస్టోను బీట్ చేసేలా ఉండాలనుకుంటే మరిన్ని ప్రకటనలు చేసేందుకు కూడా సిద్ధమవొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రచారంలో పలు అంశాలు...?
బీఆర్ఎస్ ప్రకటించే మేనిఫెస్టోలో ప్రధానంగా రైతులకు పెద్దపీఠ వేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు ఫించన్లు ఇచ్చే విషయంపై ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తున్న రైతుబంధును పెంచటంతో పాటు మరిన్ని కొత్త స్కీమ్ లు ప్రకటిస్తారని సమాచారం. రుణమాఫీపై కూడా మరోసారి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇచ్చే విషయంపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారట! ఇవే కాకుండా ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు....రాష్ట్రంలోని పలు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆకర్షించే పథకాలను ప్రకటించే అవకాశం ఉందంట.
మొత్తంగా ఓవైపు ప్రతిపక్షాలపై మాటల దాడిని మొదలుపెట్టిన బీఆర్ఎస్... మరోవైపు ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడిందనే చెప్పొచ్చు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత... మరింత స్పీడ్ ను పెంచేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధినేత కేసీఆర్ అనారోగ్యానికి గురైన నేపథ్యంలో... కోలుకున్న తర్వాతే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఆయన రాకతో... ఎన్నికల ప్రచారంలో ‘కారు’ టాప్ గేర్ వేయటం ఖాయమనే చెప్పొచ్చు…!